Share News

Heavy Rains: సెప్టెంబరులోనూ అధిక వర్షాలే

ABN , Publish Date - Sep 01 , 2025 | 06:01 AM

ఆగస్టులో భారీ వర్షాలు, వరదలు, కొండ చరియలు విరిగిపడి అనేక ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. సెప్టెంబరులోనూ దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని...

Heavy Rains: సెప్టెంబరులోనూ అధిక వర్షాలే

  • దీర్ఘకాల సగటులో 109 శాతం నమోదుకు చాన్స్‌

  • పర్వత ప్రాంతాలకు కొండ చరియల ముప్పు

  • రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం

  • 2-3 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు: వెదర్‌ మ్యాన్‌

విశాఖపట్నం/అమరావతి, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): ఆగస్టులో భారీ వర్షాలు, వరదలు, కొండ చరియలు విరిగిపడి అనేక ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. సెప్టెంబరులోనూ దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. దీర్ఘకాల సగటులో 109 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. పర్వత ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడేలా మేఘ విస్ఫోటనాలు జరుగుతాయని తెలిపింది. నాలుగు నెలల నైరుతి రుతుపవనాల సీజన్‌లో చివరి నెల సెప్టెంబరుకు సంబంధించి ముందస్తు అంచనా నివేదికను ఐఎండీ ఆదివారం విడుదల చేసింది. దీర్ఘకాల సగటు (1971 నుంచి 2020 వరకు) మేరకు సెప్టెంబరులో 16.79 సెంటీమీటర్ల వర్షం కురవాలి. అయితే దీని కంటే 9ు ఎక్కువ వర్షపాతం కురవనుందని అంచనా వేసింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే అధికంగా, తూర్పు/ఈశాన్య/దక్షిణ భారతంలో కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. ఏపీ, తెలంగాణలో తక్కువగా, కర్ణాటక, మరికొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదు కానుంది. ఏపీలో కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కానుంది. ఉత్తర కోస్తా, ఉమ్మడి అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనాలు పేర్కొన్నాయి.


జూన్‌-ఆగస్టు మధ్య 6.1 శాతం ఎక్కువ

నైరుతి సీజన్‌లో అనేక మార్పులు రావడంతో దేశంలో 1980 దశకం నుంచి సెప్టెంబరులో వర్షపాతం పెరుగుతూనే ఉంది. గత నాలుగైదు ఏళ్లలో మరింత ఎక్కువగా నమోదైంది. ఈ నెలలో నైరుతి రుతుపవనాలు నిష్క్రమించి, ఈశాన్య రుతుపవనాల ఆగమనం మధ్య సంధికాలం కావడంతో వెస్ట్రన్‌ డిస్ట్రబెన్స్‌లు, రుతుపవనాల కలయికతో ఎక్కువ వర్షాలు కురుస్తున్నందున అనేక ప్రాంతాల్లో వరదలు సంభవిస్తున్నాయని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న తటస్థ పరిస్థితుల ప్రభావంతో దేశంలో రుతుపవనాల సీజన్‌లో మంచి వర్షాలు కురిశాయి.


2 వారాల్లో రెండు అల్పపీడనాలు!

ఒడిసాకు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ఆదివారం ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీని ప్రభావంతో మంగళవారం అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థలు వెల్లడించాయి. రానున్న 2-3 రోజులు ఉత్తర కోస్తాలో అనేక చోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపాయి. తీరం వెంబటి గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, మూడో తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది. ఆవర్తనం ప్రభావంతో ఆదివారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు, ఒకటి, రెండుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, రెండో వారంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని వెదర్‌మ్యాన్‌ ఒకరు పేర్కొన్నారు. ఈ ప్రభావంతో రానున్న రెండు వారాల్లో ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాలకు భారీ వర్షాలు, వరద ముప్పు ఉంటుందని హెచ్చరించారు.

Updated Date - Sep 01 , 2025 | 06:02 AM