Share News

Flood Warning: దంచికొట్టిన వాన

ABN , Publish Date - Aug 18 , 2025 | 04:29 AM

అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపిలేకుండా జడివాన కురుస్తూనే ఉంది. విశాఖ జిల్లా కాపులుప్పాడ లో 15.3, అల్లూరి జిల్లా పాడేరులో...

Flood Warning: దంచికొట్టిన వాన

  • విశాఖ, శ్రీకాకుళం సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం

  • పొంగిన గెడ్డలు, వాగులు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపిలేకుండా జడివాన కురుస్తూనే ఉంది. విశాఖ జిల్లా కాపులుప్పాడ లో 15.3, అల్లూరి జిల్లా పాడేరులో 13.4, అనకాపల్లి జిల్లా చీడికాడలో 12.3, శ్రీకాకుళం జిల్లా హరిపురంలో 12 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో గెడ్డలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మత్స్యగెడ్డ ఉగ్రరూపం దాల్చడంతో రాయిగెడ్డ కాజ్‌వే పైనుంచి వర్షం నీరు ప్రవహించింది. కాజ్‌వేకి అవతల ఉన్న గ్రామాల గిరిజనులు ఇళ్లకే పరిమితమయ్యారు. జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లోని గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పంట పొలాల్లో నీరు చేరడంతో చెరువులను తలపిస్తున్నాయి. అనకాపల్లి జిల్లాలోనూ లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. పలు చోట్ల వృక్షాలు నేలకొరిగాయి. చోడవరం మండలంలోని దుడ్డుపాలెంలో పిడుగుపాటుకు 30 గొర్రెలు మృతి చెందాయి. విశాఖ జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు కలెక్టర్‌ ఎంఎన్‌.హరేంధిరప్రసాద్‌ సోమవారం సెలవు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆర్టీసీ కాంప్లెక్స్‌ ప్రాంగణంలో వర్షం నీరు నిలిచి చెరువును తలపిస్తోంది. పంటపొలాలు చెరువుల్లా తయారయ్యాయి. మందసలో సముద్రం అల్లకల్లోలంగా మారి తీరంలోని పడవలు కొట్టుకుపోయాయి. సముద్రం ముందుకు రావడంతో తీరప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక ఏలూరు జిల్లాలో కొల్లేరుకు ఎగువ నుంచి పెద్దఎత్తున వరద చేరడంతో లంక గ్రామాలను నీరు చుట్టుముట్టింది.


పెద్దఎడ్లగాడి నుంచి పెనుమాకలంకకు వెళ్లే రహదారిపై మూడ డుగుల మేర నీరు చేరడంతో రాకపోకలను నిలిపివేశారు. ప్రజలు ట్రాక్టర్లపై రాకపోకలు సాగిస్తున్నారు. మరో రెండు రోజుల్లో కొల్లేరుకు మరింత వరద నీరు పెరగనున్నట్టు హెచ్చరికలు చేయడంతో లంక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో వర్షాలకు 24,500 ఎకరాల్లో పంట నీట మునిగింది. గత ఏడాది నాట్లుపూర్తిఅయిన తర్వాత 28వేల ఎకరాలల్లో వరి పొలాలు దెబ్బతిన్నాయి. ఈ ఏడాది అదే పునరావృతం కానుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

కృష్ణా, గోదావరిలో వరద ఉధృతి

కృష్ణానదిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు 2,08,330 క్యూసెక్కుల వరద పులిచింతల ప్రాజెక్టుకు చేరుతోంది. మూసీనది నుంచి వస్తున్న నీరు కూడా పులిచింతలలో కలుస్తోంది. పులిచింతల నుంచి 1,93,885 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో పాటు మునేరు వాగు నుంచి వస్తున్న వరదతో ప్రకాశం బ్యారేజీలో నీటిమట్టం పెరిగింది. బ్యారేజీ 70 గేట్లను ఎత్తి 2,85,392 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి పంపుతున్నారు. గోదావరి లోనూ నీటిమట్టం భారీగా పెరుగుతోంది. భద్రాచలం వద్ద ఆదివారం నీటిమట్టం 33.60 అడుగులకు చేరింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వేలోకి అదనంగా వస్తున్న 5,14,353 క్యూసెక్కులను జలవనరుల శాఖ అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే ఎగువన 30.18 మీటర్లు, దిగువన 20.80 మీటర్ల నీటిమట్టం నమోదైంది.

Updated Date - Aug 18 , 2025 | 04:30 AM