Heavy Rains: రేపటి నుంచి కోస్తాలో భారీ వర్షాలు
ABN , Publish Date - Aug 10 , 2025 | 04:49 AM
ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిశాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈనెల 13వ తేదీన అల్పపీడనం ఏర్పడనుంది. దానికి ఒకరోజు ముందు అదే ప్రాంతంలో ఆవర్తనం ఆవరించే అవకాశం ఉంది.
13న బంగాళాఖాతంలో అల్పపీడనం
విశాఖపట్నం, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిశాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈనెల 13వ తేదీన అల్పపీడనం ఏర్పడనుంది. దానికి ఒకరోజు ముందు అదే ప్రాంతంలో ఆవర్తనం ఆవరించే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో కోస్తాలో వర్షాలు పెరగనున్నాయి. ఈనెల 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కోస్తాలో అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 12 నుంచి 14వ తేదీ వరకు కోస్తాలో ఎక్కువచోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా, దక్షిణ కోస్తాంధ్ర పరిసరాలు, ఉత్తర కర్ణాటకల్లో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు ఆవరించాయి. ఇంకా శనివారం ఉదయం నుంచి ఎండ తీవ్రత కొనసాగడంతో వాతావరణ అనిశ్చితి నెలకొని కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి. ఆదివారం రాయలసీమలో అనేకచోట్ల, కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, చాలా రోజులుగా మధ్యభారతం, తర్వాత ఉత్తరాదిలో కొనసాగిన రుతుపవన ద్రోణి రెండు రోజుల్లో దక్షిణాది వైపు రానున్నది. దాని తూర్పుభాగం నాలుగైదు రోజులు దక్షిణాది వైపు కొనసాగే అవకాశం ఉంది.