Heavy Rains: కోస్తాకు వాయుగండం!
ABN , Publish Date - Oct 19 , 2025 | 03:08 AM
రానున్న ఐదారు రోజుల్లో కోస్తాకు వాయుగుండం ముప్పు పొంచి ఉంది. అలాగే, ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని....
21న బంగాళాఖాతంలో అల్పపీడనం
23న వాయుగుండంగా మారే చాన్స్
కోస్తాలో తీరం దాటొచ్చని ఐఎండీ అంచనా
22 నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు
విశాఖపట్నం/అమరావతి, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): రానున్న ఐదారు రోజుల్లో కోస్తాకు వాయుగుండం ముప్పు పొంచి ఉంది. అలాగే, ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీని ప్రభావంతో ఈనెల 21వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించే క్రమంలో వాయుగుండంగా బలపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత రెండు రోజుల్లో కోస్తాంధ్ర దిశగా పయనించి దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు మధ్య తీరం దాటనుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో తుఫాన్‌గా మారే అవకాశం ఉందని, సోమవారం నాటికి మరింత స్పష్టత వస్తుందని వివరించారు. దీని ప్రభావంతో ఈనెల 22 నుంచి 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల వర్షాలు కురుస్తాయని, పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. కాగా, శనివారం ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం సాయంత్రానికి తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది వచ్చే 36 గంటల్లో పశ్చిమ వాయవ్యంగా పయనించి వాయుగుండంగా బలపడుతుందని ఐఎండీతెలిపింది. బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పుగాలుల ప్రభావంతో శనివారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల పిడుగులు, ఉరుములతో వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం పడటంతో రోడ్డన్నీ జలమయమయ్యాయి. రానున్న 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు, ఒకటిరెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కాగా ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.