Weather Forecast: 29 నుంచి భారీవర్షాలు
ABN , Publish Date - Nov 25 , 2025 | 06:17 AM
మలక్కా జలసంధి, దానికి ఆనుకుని మలేషియా పరిసరాల్లో తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి మంగళవారం నాటికి...
రైతులు పంటలను జాగ్రత్త చేసుకోవాలి
వాతావరణ అధికారుల సూచన
విశాఖపట్నం/అమరావతి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): మలక్కా జలసంధి, దానికి ఆనుకుని మలేషియా పరిసరాల్లో తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి మంగళవారం నాటికి దక్షిణ అండమాన్ సముద్రంలోకి ప్రవేశించి వాయుగుండంగా మారనుంది. ఆ తర్వాత 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించి తుఫాన్‌గా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
అలాగే, కామరూన్ పరిసరాల్లో ఆవరించిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శ్రీలంకకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో మంగళవారం మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది బలపడి తమిళనాడు తీరం వైపు వెళుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రెండు అల్పపీడనాలు బలపడి ఈ నెల 29 నాటికి తమిళనాడు, దానికి ఆనుకుని కోస్తా తీరం వైపు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ 29వ తేదీన దక్షిణ కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా, అక్కడక్కడ భారీగా, ఉత్తరకోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయి.
ఈ నెల 30న రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీవర్షాలు, ఉత్తర కోస్తాలో భారీవర్షాలు కురుస్తాయి. ఆ తర్వాత రెండు రోజుల్లో కోస్తాలో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనాల ప్రభావంతో ఈ నెల 25 నుంచి 28 వరకూ దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, ఉత్తరకోస్తాలో పొడి వాతావరణం నెలకొంటుందని పేర్కొంది. రైతులు ముందు జాగ్రత్త చర్యగా కోతకు సిద్ధంగా ఉన్న పంటలను వెంటనే కోసి, నూర్పిళ్లు చేసుకోవాలని అమరావతి వాతావరణ కేంద్రం అధికారిణి స్టెల్లా సూచించారు.