Anakapalli District: శివమెత్తిన శారద..
ABN , Publish Date - Oct 31 , 2025 | 03:55 AM
అనకాపల్లి జిల్లాలో మొంథా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో శారదానది శివమెత్తింది. గండ్లు తెగిపోవడంతో పోటెత్తి ప్రవహిస్తూ...
భారీ వర్షాలతో గండ్లు.. 1,500 ఎకరాలు మునక
ముంపునకు గురైన వై.లోవ గ్రామం
అనకాపల్లి, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లాలో మొంథా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో శారదానది శివమెత్తింది. గండ్లు తెగిపోవడంతో పోటెత్తి ప్రవహిస్తూ...వందలాది ఎకరాల పంట పొలాలను ముంచేసింది. తుఫాన్ మొదలైనప్పటినుంచీ జిల్లాలో భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. దీనికితోడు ఎగువనున్న రైవాడ, పెద్దేరు, కోనాం జలాశయాల నుంచి పెద్ద మొత్తంలో వరద నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మంగళవారం నుంచి శారదా నదిలో వరద ప్రవాహం క్రమేపీ పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో గురువారం మేజర్ శారదానదికి రాంబిల్లి మండలం రజాల అగ్రహారం వద్ద, మైనర్ శారదా నదికి నారాయణపురం వద్ద గండ్లు పడ్డాయి. రజాల, మర్రిపాలెం, కట్టుబోలు, మురకాడ, మర్రిపాలెం తదితర గ్రామాల పరిధిలోని 1,500 ఎకరాల్లో వరి పంట, 50 ఎకరాల కొబ్బరి తోటలు మునిగిపోయాయి. నదికి సమీపంలో ఉన్న వై.లోవ గ్రామంలోకి నీరు ప్రవేశించింది. 30 ఇళ్లు, ప్రభుత్వ పాఠశాల, దేవాలయాలు ముంపునకు గురయ్యాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శారదా నీటి ప్రవాహానికి అడ్డుగా ఎన్‌ఏవోబీ లో వంతెన నిర్మించారని, దానివల్ల వరద సముద్రంలోకి వెళ్లకుండా, వెనక్కు తన్నడంతో గట్లకు గండ్లు పడ్డాయని రైతులు, వై.లోవ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, వై.లోవ గ్రామస్థులను కలెక్టర్ విజయకృష్ణన్, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ పరామర్శించి సహాయ చర్యలు చేపట్టారు. జిల్లాలో తీర ప్రాంత గ్రామాలు, లోతట్టు ప్రాంతాల వారిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. గురువారం 78 పునరావాస కేంద్రాలు కొనసాగాయి.