Share News

Heavy Rains Alert: రేపు అల్పపీడనం

ABN , Publish Date - Aug 12 , 2025 | 04:14 AM

ఉత్తరకోస్తా, దానికి ఆనుకుని తెలంగాణ పరిసరాల్లో సోమవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వాతావరణ అనిశ్చితితో సముద్రం నుంచి తేమగాలులు కోస్తాపైకి వీచాయి. వీటి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల పిడుగులు...

Heavy Rains Alert: రేపు అల్పపీడనం

  • వాయుగుండంగా బలపడే అవకాశం

  • రాష్ట్రానికి భారీ వర్షసూచన

  • ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ వర్షం

  • ప్రమాదకరంగా కుందూనది

  • నీట మునిగిన పంటలు

  • లోతట్టు కాలనీలు జలమయం

  • పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

ఉత్తరకోస్తా, దానికి ఆనుకుని తెలంగాణ పరిసరాల్లో సోమవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వాతావరణ అనిశ్చితితో సముద్రం నుంచి తేమగాలులు కోస్తాపైకి వీచాయి. వీటి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. అక్కడక్కడ భారీవర్షాలు పడ్డాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి నుంచి ఎడతెరపి లేని వానకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్తంభించాయి. కుందూనది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. నది పరీవాహక ప్రాంతాల్లోని వరి, మినుము, మొక్కజొన్న పంటలు పూర్తిగా నీట మునిగాయి. కుందూనది వంతెనలపై నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.


నేడు కోస్తా, సీమల్లో భారీ వర్షాలు..

మంగళవారం కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశాకు ఆనుకుని అల్పపీడనం ఏర్పడనుందని, ఆ తర్వాత రెండు రోజుల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఈనెల 16వ తేదీ వరకు కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. 13 నుంచి 15వ తేదీ వరకు కోస్తాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. మంగళవారం రాష్ట్రంలోని పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.


శ్రీశైలానికి భారీగా వరద

ఎగువ నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం జలాశయం నిండుకుండను తలపిస్తోంది. దీంతో కుడి, ఎడమ గట్టు జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పాదన ద్వారా 66,202 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు, ప్రస్తుతం 881.80 అడుగులకు చేరింది. డ్యాంలో 197.9120 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

Updated Date - Aug 12 , 2025 | 04:14 AM