Heavy Rainfall: నేడు ఉత్తర కోస్తా, సీమలో భారీ వర్షాలు
ABN , Publish Date - Oct 09 , 2025 | 05:24 AM
దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరిన్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది.
11న బంగాళాఖాతంలో అల్పపీడనం
విశాఖపట్నం/అమరావతి, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరిన్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. ఇంకా సముద్రం నుంచి తేమగాలులు భూ ఉపరితలంపైకి వీస్తుండటంతో రాష్ట్రంలో అనేకచోట్ల బుధవారం ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. తిరుపతి జిల్లా డక్కిలిలో 8.4, అనకాపల్లి జిల్లా ఈ.మర్రిపాలెంలో 8, నెల్లూరు జిల్లా దగదర్తిలో 7.6, ఏలూరు జిల్లా కాకర్లమూడిలో 6.2, అల్లూరి జిల్లా అరకులో 6.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో వారం రోజుల్లో నైరుతి రుతుపవనాలు నిష్క్రమించి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయని, ఈ మధ్యకాలంలో వాతావరణ మార్పుల ప్రభావంతో తీవ్రమైన అనిశ్చితి నెలకొని ఉరుములు, పిడుగులు సంభవిస్తున్నాయని వాతావరణ అధికారి ఒకరు తెలిపారు. ఈనెల పదో తేదీన ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, దాని ప్రభావంతో 11న అల్పపీడనం ఏర్పడనున్నట్టు పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్, ఒడిశాల్లో వర్షాలు కురుస్తాయని, ఉత్తరకోస్తాలోనూ కురిసే అవకాశం ఉందని తెలిపారు. కాగా, రానున్న రెండు రోజులు ఉత్తరాంధ్ర, రాయలసీమలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గురువారం అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.