Share News

Meteorological Department: నేడు సీమ, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు

ABN , Publish Date - Sep 18 , 2025 | 06:23 AM

మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ, తెలంగాణ, దక్షిణ కోస్తా మీదుగా బంగాళాఖాతం వరకూ, దక్షిణ కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా కొమరిన్‌ ప్రాంతం వరకూ వేర్వేరుగా ఉపరితల ద్రోణులు విస్తరించాయి.

Meteorological Department: నేడు సీమ, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు

విశాఖపట్నం/అమరావతి, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ, తెలంగాణ, దక్షిణ కోస్తా మీదుగా బంగాళాఖాతం వరకూ, దక్షిణ కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా కొమరిన్‌ ప్రాంతం వరకూ వేర్వేరుగా ఉపరితల ద్రోణులు విస్తరించాయి. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఎండ తీవ్రత కొనసాగడంతో వాతావరణ అనిశ్చితి నెలకొంది. ఈ ప్రభావంతో బుధవారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో 6.4, ఉమ్మడి చిత్తూరు జిల్లా నిండ్రలో 5.9, కె.ఉప్పలపాడులో 5.3, వేములపాడులో 4.7, చిలకపాడులో 4.5, విజయనగరం జిల్లా రాజాంలో 4, కాకినాడలో 3.9 సెంటీమీటర్ల వాన పడింది. రానున్న 24 గంటల్లో రాయలసీమలో అనేకచోట్ల, కోస్తాలో పలుచోట్ల ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని, రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో అక్కడక్కడ భారీవర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

కాగా, గురువారం రాష్ట్రంలో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఒకటీరెండు చోట్ల, అలాగే కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, ఈనెల 22న లేదా 23న ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించనుందని, అది అల్పపీడనంగా మారుతుందా? లేదా? అనేది రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని ఇస్రో వాతావరణ నిపుణుడు ఒకరు తెలిపారు. ఈనెల 26న లేదా 27న మధ్య బంగాళాఖాతంలో ఇంకో ఉపరితల ఆవర్తనం ఆవరించనుందన్నారు. ఇది బలపడే అవకాశం ఉందని అంచనా వేశారు.

Updated Date - Sep 18 , 2025 | 10:31 AM