Heavy Rain: బంగాళాఖాతంలో వాయుగుండం
ABN , Publish Date - Oct 02 , 2025 | 03:55 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం వాయుగుండంగా బలపడింది. ఇది విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా....
నేడు తీవ్ర వాయుగుండంగా మార్పు?
రేపు గోపాల్‌పూర్-పారాదీప్ మధ్య తీరంపైకి
ఉత్తరకోస్తాకు అతిభారీ, దక్షిణ కోస్తాకు భారీ వర్షాలు
ఓడరేవుల్లో మూడో నంబరు హెచ్చరిక
విశాఖపట్నం/అమరావతి, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం వాయుగుండంగా బలపడింది. ఇది విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 360, గోపాల్‌పూర్‌కు 360 కి.మీ. దక్షిణ ఆగ్నేయంగా, పూరికి 390 కి.మీ. దక్షిణంగా కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర వాయవ్యంగా పయనించి గురువారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. ఆ తర్వాత వాయగుండంగా బలహీనపడి గురువారం అర్ధరాత్రి లేదా శుక్రవారం తెల్లవారుజామున గోపాల్‌పూర్, పారాదీప్ మధ్య పూరి సమీపంలో తీరం దాటనుంది. దీని ప్రభావంతో బుధవారం కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. అనకాపల్లి జిల్లా మాడుగులలో 7.35, గాదిరాయిలో 5.17, శ్రీకాకుళం జిల్లా పలాసలో 4.05 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకూ కోస్తాలో అనేకచోట్ల భారీవర్షాలు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం ఉత్తరకోస్తాలో ఎక్కువచోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సముద్రం అల్లకల్లోలంగా మారిందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. కోస్తాలోని అన్ని ఓడరేవుల్లో మూడో నంబరు భద్రతా సూచిక ఎగురవేశారు.
రెండు సముద్రాల్లో ఒకేసారి వాయుగుండాలు..
బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుండగా.. అదే సమయంలో గుజరాత్‌కు ఆనుకుని ఈశాన్య అరేబియా సముద్రంలో మరో వాయుగుండం కొనసాగుతోంది. ప్రస్తుతం రెండింటి మధ్య మూడు వేల కిలోమీటర్ల దూరం ఉన్నందున ఒకదానిపై మరొకటి ప్రభావం చూపే అవకాశం లేదని వాతావరణ అధికారి సముద్రాల జగన్నాథకుమార్ తెలిపారు. కోస్తాలో తీరం వెంబటి గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.