Weather Forecast: మరింత పెరగనున్న వర్షాలు
ABN , Publish Date - Aug 30 , 2025 | 05:48 AM
ఉపరితలద్రోణి దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి విదర్భ, కర్ణాటక మీదుగా కేరళ వరకూ విస్తరించింది. దీనికితోడు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో...
3న అల్పపీడనం, 5న వాయుగుండం
విశాఖపట్నం, అమరావతి, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): ఉపరితలద్రోణి దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి విదర్భ, కర్ణాటక మీదుగా కేరళ వరకూ విస్తరించింది. దీనికితోడు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో శుక్రవారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 31న కోస్తా పరిసరాల్లో ఉపరితలద్రోణి బలపడే అవకాశం ఉన్నందున వర్షాలు పెరుగుతాయని పేర్కొంది. వచ్చేనెల 2న బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించిన తరువాత 3న అల్పపీడనం ఏర్పడి, 5వ తేదీకి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో శనివారం అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
నిమజ్జనంలో జాగత్త్రలు పాటించాలి!
ప్రస్తుతం కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహాలు ఉన్నందున వినాయక నిమజ్జన సమయంలో అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. కాలువలు, వాగులు దాటే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. కృష్ణానది వరద ప్రవాహం ప్రకాశం బ్యారేజి వద్ద 3.08లక్షల క్యూసెక్కులు ఉందని పేర్కొంది.