Heavy Rainfall: జోరుగా వర్షాలు
ABN , Publish Date - Jul 22 , 2025 | 05:26 AM
రాష్ట్రంలో వర్షపాతం మెరుగుపడింది. ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావం, రుతుపవనాల కదలికతో గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో 14 జిల్లాల్లో వర్షపాతం సాధారణ స్థితికి వచ్చింది.
మెరుగైన వర్షపాతం..14 జిల్లాల్లో సాధారణ స్థితి
పలు నగరాల్లో భారీ వర్షం
నర్సీపట్నంలో 114 మి.మీ.
మరో ఐదు రోజులు వర్షాలు
అమరావతి/విశాఖపట్నం/పోలవరం, జూలై 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వర్షపాతం మెరుగుపడింది. ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావం, రుతుపవనాల కదలికతో గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో 14 జిల్లాల్లో వర్షపాతం సాధారణ స్థితికి వచ్చింది. అయితే, మరో 12 జిల్లాల్లో లోటు నెలకొందని వాతావరణ నిపుణులు తెలిపారు. విజయనగరం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షపాతం సాధారణ స్థాయికి చేరగా, శ్రీకాకుళం, మన్యం, కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో వర్షపాతం సాధారణం కన్నా తక్కువగా ఉంది. రాష్ట్రంలో జూన్ 1 నుంచి ఈ నెల 21 వరకు 199.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటి వరకు 157.1 మిల్లీమీటర్లు నమోదైంది. మరోవైపు, గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఖరీఫ్ పంటలు జీవం పోసుకున్నాయి. ఈ నెల 24న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ విభాగం ప్రకటించింది. కాగా సోమవారం కోస్తా జిల్లాల్లో అనేక చోట్ల వర్షాలు పడ్డాయి. అలాగే మంగళవారం అల్లూరి సీతారామరాజు, ఉభయగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని, మిగతా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
24న అల్పపీడనం
రాష్ట్రంలో మరో ఐదు రోజులపాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు, దక్షిణ ఒడిసా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో సోమవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు నర్సీపట్నంలో 114, మందసలో 88.75, గొలుగొండలో 88.25, ఇనుమెల్ల(పల్నాడు జిల్లా)లో 80, అనకాపల్లి జిల్లా గంధవరంలో 78, పరవాడలో 71, ఏలూరు జిల్లా టి.నరసాపురంలో 67.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దక్షిణ కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణశాఖ హెచ్చరించింది. కాగా, ఈ నెల 24న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది.
స్వల్పంగా పెరిగిన గోదావరి
పోలవరం నుంచి నీటి విడుదల
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఏలూరు జిల్లా పోలవరంలో గోదావరికి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో సోమవారం సాయంత్రానికి నీటి మట్టం స్వల్పంగా పెరిగింది. ప్రాజెక్టులోకి వస్తున్న 1,09,622 క్యూసెక్కుల వరదను స్పిల్‌వే 48 గేట్ల నుంచి దిగువకు విడుదల చేస్తున్నట్టు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. స్పిల్‌వే ఎగువన 27.190 మీటర్లు, దిగువన 17.170 మీటర్ల మేర నీటిమట్టం నమోదైనట్టు పేర్కొన్నారు.
