Share News

Weather Forecast: నేడు, రేపు వర్షాలు

ABN , Publish Date - Oct 10 , 2025 | 05:18 AM

దక్షిణ ఒడిశా నుంచి ఏపీ, తమిళనాడు మీదుగా కొమరిన్‌ ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది.

Weather Forecast: నేడు, రేపు వర్షాలు

  • 16 లేదా 17న ఈశాన్య రుతుపవనాల రాక

విశాఖపట్నం/అమరావతి, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): దక్షిణ ఒడిశా నుంచి ఏపీ, తమిళనాడు మీదుగా కొమరిన్‌ ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. దీనికితోడు రాష్ట్రంలో ఎండ తీవ్రంగా ఉంది. దీంతో వాతావరణ అనిశ్చితి నెలకొని గురువారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల క్యుములోనింబస్‌ మేఘాలు ఆవరించి పిడుగులు, మెరుపులు, ఉరుములతో వర్షాలు కురిశాయి. తిరుపతి జిల్లా పూలతోటలో 6.8, హస్తకావేరిలో 5.3, అనకాపల్లి జిల్లా లక్ష్మీనారాయణనగర్‌లో 5.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తాలో అనేకచోట్ల, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శుక్ర, శనివారాల్లో ఉత్తరకోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా, శుక్రవారం అల్లూరి జిల్లాతో పాటు రాయలసీమలో పిడుగులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక, ఈనెల 16 లేదా 17వ తేదీన దేశం నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించనున్నాయని, అదే సమయంలో ఈశాన్య రుతుపవనాలు దక్షిణ భారతంలోకి ప్రవేశించి వర్షాలు పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.


తిరుమలలో జోరు వాన..కొండపై పెరిగిన చలి

తిరుమల, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): తిరుమలలో గురువారం జోరున వాన పడింది. దీంతో తిరుమల క్షేత్రం మొత్తం తడిసి ముద్దయ్యింది. ఉదయం 30 నిమిషాల పాటు వర్షం దంచికొట్టింది. తిరిగి మధ్యాహ్నం మరో గంట సేపు వాన కురిసింది. శ్రీవారి దర్శనానికి వెళ్లేవారితోపాటు, దర్శనం చేసుకుని ఆలయం వెలుపలకు వచ్చిన భక్తులు కూడా తడిసి ముద్దయ్యారు. ఇక సాయంత్రం నుంచి తిరుమలలో చలి పెరిగింది. సర్వదర్శనం కోసం క్యూలైన్‌లో ఉన్న భక్తులు చలికి ఇబ్బంది పడ్డారు.

Updated Date - Oct 10 , 2025 | 05:19 AM