Weather Warning: చెన్నైలో భారీ వర్షం
ABN , Publish Date - Nov 30 , 2025 | 04:45 AM
శ్రీలంకలో విధ్వంసం సృష్టించిన ‘దిత్వా’ తుఫాను భారత్‌వైపు దూసుకొస్తుండటంతో తమిళనాడులోని 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
54 విమానాలు రద్దు.. స్కూళ్లకు సెలవు
పరీక్షలు వాయిదా వేసిన పుదుచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ
చెన్నై, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): శ్రీలంకలో విధ్వంసం సృష్టించిన ‘దిత్వా’ తుఫాను భారత్‌వైపు దూసుకొస్తుండటంతో తమిళనాడులోని 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. శనివారం రాత్రి నుంచే చెన్నై నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. తమిళనాడు, పుదుచ్చేరి తీరం వెంబడి గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో అప్పుడప్పుడు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) హెచ్చరించింది. తమిళనాడు ప్రభుత్వం శనివారం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు సెలవు ప్రకటించింది. అలాగే, శనివారం జరగాల్సిన అన్ని పరీక్షలనూ వాయిదా వేశామని పుదుచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ ప్రకటించింది. తమిళనాడులోని తీరప్రాత జిల్లాలతోపాటు, పుదుచ్చేరిలో 14 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను మోహరించారు. తుఫాను ఆదివారం ఉదయం చెన్నై తీరాన్ని సమీపించనుందని చెన్నైలోని వాతావరణ పరిశోధన కేంద్రం సౌత్‌జోన్ అధ్యక్షురాలు అముదా తెలిపారు. 14 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. కావేరి డెల్టా జిల్లాలు, కారైక్కాల్ ప్రాంతాల్లో గంటకు 55 నుంచి 65 కి.మీ.ల వేగంతో, అప్పుడప్పుడు 75 కి.మీ.ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెన్నై వాతావరణ శాఖ డైరెక్టర్ పి.సెంథామరై కన్నన్ తెలిపారు. పుదుచ్చేరిలో గంటలకు 60 నుంచి 70 కి.మీ.ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురం, తిరువణ్ణామలై, వేలూరు, తిరుపత్తూరు, కృష్ణగిరి, ధర్మపురి జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. సేలం, కళ్లకురిచ్చి, కడలూరు జిల్లాలతోపాటు పుదుచ్చేరిలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. చెన్నైలోని పలు నగరాలకు వెళ్లాల్సిన 54 విమాన సర్వీసులను రద్దు చేశారు. తుఫాను చెన్నై నగరం వైపే దూసుకొచ్చి తీరం దాటే అవకాశం ఉందని తమిళనాడు రెవెన్యూ శాఖ మంత్రి రామచంద్రన్ చెప్పారు.