Share News

Heavy Rain Forecast: కోస్తా, సీమకు వర్ష సూచన

ABN , Publish Date - Aug 15 , 2025 | 05:00 AM

దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్రకు ఆనుకుని వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బుధవారం ఉదయం ఏర్పడి..

Heavy Rain Forecast: కోస్తా, సీమకు వర్ష సూచన

విశాఖపట్నం, అమరావతి, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్రకు ఆనుకుని వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బుధవారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. శుక్రవారం నాటికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా తీరం దాటనుంది. దీని ప్రభావంతో శుక్రవారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు, ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయి. గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలకు వరద ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. కాగా.. బంగాళాఖాతంలో 18న అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తోంది. దీనిప్రభావంతో 17 నుంచి ఉత్తర కోస్తాలో, 18, 19 తేదీల్లో కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు, ఉత్తర కోస్తాలో భారీవర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మరోవైపు ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద తగ్గేవరకూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్‌ సూచించారు. కాగా, భారీవర్షాలకు గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. గురువారం సాయంత్రానికి పోలవరం ఎగువన భద్రాచలం వద్ద 19.80 అడుగులకు చేరింది. మంజీర, శబరి, సీలేరు, ప్రవర, పర్ణ, ఇంద్రావతి నదులు పొంగి పొర్లుతూ గోదావరిలో కలుస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టులోకి అదనంగా వస్తున్న 1,90,566 క్యూసెకులు దిగువకు విడుదల చేసినట్టు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. స్పిల్‌వే ఎగువన 27.950 మీ, దిగువన 18.120మీ. నీటిమట్టం నమోదైంది.

Updated Date - Aug 15 , 2025 | 07:37 AM