Flood Impact: రోడ్లకు వాన దెబ్బ
ABN , Publish Date - Aug 20 , 2025 | 05:22 AM
వర్షాల ధాటికి రాష్ట్రంలో రహదారులు భారీగా దెబ్బతిన్నాయి. గ్రామీణ, పట్టణ, అంతర్ జిల్లా రహదారులతోపాటు, రాష్ట్ర హైవేలు సైతం భారీగా కోతకు గురయ్యాయి.
వరదలకు 1582 కి.మీ. మేర దెబ్బతిన్న రహదారులు
తక్షణ మరమ్మతులకు 100 కోట్లు
సీఈ, ఎస్‌ఈలతో మంత్రి బీసీ సమీక్ష
అమరావతి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): వర్షాల ధాటికి రాష్ట్రంలో రహదారులు భారీగా దెబ్బతిన్నాయి. గ్రామీణ, పట్టణ, అంతర్ జిల్లా రహదారులతోపాటు, రాష్ట్ర హైవేలు సైతం భారీగా కోతకు గురయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,582 కి.మీ. మేర ఆర్‌అండ్‌బీ రహదారులు దెబ్బతిన్నట్లు ఆశాఖ ప్రాథమిక అంచనావేసింది. వీటిలో 987 కి.మీ. జిల్లా ప్రధాన రహదారులు కాగా, 595 కి.మీ. మేర రాష్ట్ర హైవేలు ఉన్నాయి. ఈ పరిస్థితిపై ప్రభుత్వం అప్రమత్తమైంది. తక్షణ మరమ్మతులు చేపట్టాలని, ఆ రహదారులను పూర్వస్థితికి తీసుకొచ్చేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. రహదారుల తక్షణ మరమ్మతులకు రూ.100 కోట్లు మేర, శాశ్వత ప్రాతిపదికన పునర్‌నిర్మాణం చేయడానికి కనీసం రూ.1,215 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని ఆశాఖ ప్రాథమిక నివేదికను రూపొందించింది. ఇదిలా ఉంటే వరదలు, వర్షాల నేపథ్యంలో ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆ శాఖ ఇంజనీరింగ్ చీఫ్, చీఫ్ ఇంజనీర్‌లు, జిల్లాల ఎస్‌ఈలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రహదారులకు గండ్లుపడి, పూర్తిగా రాకపోకలు నిలిచిపోయిన ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.