Massive Water Release: శ్రీశైలం జోరు.. సాగర్ హోరు
ABN , Publish Date - Aug 02 , 2025 | 05:20 AM
ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు 8 క్రస్ట్ గేట్లను పదడుగుల మేర ఎత్తి శుక్రవారం 2,15,424 క్యూసెక్కులు దిగువకు..
నంద్యాల, విజయపురిసౌత్, అచ్చంపేట, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు 8 క్రస్ట్ గేట్లను పదడుగుల మేర ఎత్తి శుక్రవారం 2,15,424 క్యూసెక్కులు దిగువకు.. కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ ఉత్పాదన నిమిత్తం మరో 65,592 క్యూసెక్కుల నీరు నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. అలాగే తెలంగాణాలోని కల్వకుర్తికి 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి 2,52,560 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం డ్యాంలోకి వచ్చి చేరుతోంది. డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 882.50 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 201.5822 టీఎంసీలుగా నమోదైంది.
సాగర్‌లో 26 గేట్ల నుంచి నీటి విడుదల
నాగార్జున సాగర్ పాజ్రెక్ట్‌కు శ్రీశైలం నుంచి 2,57,342 క్యూసెక్కుల భారీ వరద చేరుతోంది. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు. శుక్రవారం ప్రాజెక్ట్ అధికారులు 26 క్రస్ట్‌గేట్ల ద్వారా 2,09,966 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సాగర్ ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 28,988 క్యూసెక్కులు, కుడి కాలువ ద్వారా 8604, ఎడమ కాలువ ద్వారా 7684, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1800, ఎల్‌ఎల్‌సీ ద్వారా 300, మొత్తం ఔట్‌ఫ్లో వాటర్‌గా 2,57,342 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 585.20 అడుగులుంది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు ఇన్‌ఫ్లో వాటర్‌గా 2,57,342 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.
పులిచింతల నుంచి 2,05,278 క్యూసెక్కులు..
పులిచింతల ప్రాజెక్టులో శుక్రవారం 40.44 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్టు ప్రాజెక్టు ఏఈ రాజు తెలిపారు. ఎగువ నుంచి 2,12,271 క్యూసెక్కులు ప్రాజెక్టుకు చేరుతోంది. పవర్ జనరేషన్ ద్వారా 16,600 క్యూసెక్కులు, ఎనిమిది గేట్ల ద్వారా 1,88,278 క్యూసెక్కులు, లీకుల ద్వారా 400 క్యూసెక్కులు, మొత్తం 2,05,278 క్యూసెక్కుల నీరు దిగువన విడుదలవుతోంది.