Share News

Srisailam Dam: శ్రీశైలానికి భారీ వరద

ABN , Publish Date - Jul 07 , 2025 | 01:51 AM

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం డ్యాంకు వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి 1,86,212 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. డ్యాం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులకుగాను ప్రస్తుతం 879.30 అడుగుల వరకు నీరు...

Srisailam Dam: శ్రీశైలానికి భారీ వరద

  • ఎగువ నుంచి 1,86,212 క్యూసెక్కుల రాక

  • 879 అడుగులకు చేరిన నీటిమట్టం

  • గోదావరికీ వరద పోటు

  • ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు

  • బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం

  • రాష్ట్రంలో మాత్రం వర్షాభావమే

విశాఖపట్నం/పోలవరం/కర్నూలు, జూలై 6(ఆంధ్రజ్యోతి): ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం డ్యాంకు వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి 1,86,212 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. డ్యాం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులకుగాను ప్రస్తుతం 879.30 అడుగుల వరకు నీరు చేరింది. డ్యాం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలకు గాను ప్రస్తుతం 184.27 టీఎంసీల నీరు ఉంది. ఎగువన జూరాల ప్రాజెక్టు నుంచి 1,09,216 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 67,218 క్యూసెక్కులు శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి 10వేల క్యూసెక్కులు రాయలసీమ కాలువలకు వదులుతున్నారు. విద్యుదుత్పత్తి ద్వారా 67,740 క్యూసెక్కులు నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. అలాగే తుంగభద్ర జలాశయానికి ఎగువ నుంచి 52,308 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. డ్యాం గరిష్ఠ నీటిమట్టం 1633 అడుగులకుగాను ప్రస్తుతం 1625.26 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటినిల్వ సామర్థ్యం 105.78 టీఎంసీలకుగాను ప్రస్తుతం 77.34 టీఎంసీల నీరు నిల్వ చేశారు. 22 గేట్లు ఎత్తి 62,444 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఆర్డీఎస్‌ ఆనకట్టపై వరద పోటెత్తింది. మంత్రాలయం వద్ద భారీగా వరద ఉండటంతో భక్తులను అప్రమత్తం చేశారు. సుంకేసుల జలాశయానికి 67,218 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.


నేడు గోదారి పరీవాహక ప్రాంతాల్లో కుంభవృష్టి

పశ్చిమబెంగాల్‌ పరిసరాల్లో ఆదివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న రెండు మూడు రోజుల్లో పశ్చిమ వాయవ్యంగా జార్ఖండ్‌, ఉత్తర ఛత్తీ్‌సగఢ్‌ మీదుగా నెమ్మదిగా పయనించనుంది. దీని ప్రభావంతో ఆదివారం ఒడిశా, ఛత్తీ్‌సగఢ్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. సోమవారం ఛత్తీ్‌సగఢ్‌లో ప్రధానంగా గోదావరి పరీవాహక ప్రాంతంలో అనేకచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని ఇస్రో వాతావరణ విభాగం తెలిపింది. దీంతో వచ్చే రెండు మూడు రోజుల్లో గోదావరికి వరద పోటెత్తుతుందని హెచ్చరించింది. ముఖ్యంగా వైన్‌గంగా, ప్రాణహిత నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద ఉధృతి పెరగనుంది.

పోలవరం నుంచి 2,23,309 క్యూసెక్కుల విడుదల

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉపనదులు, ఏజెన్సీలోని వాగులు పొంగి భారీగా వరద గోదావరిలో కలుస్తోంది. దీంతో ఏలూరు జిల్లాలో గోదావరి నీటిమట్టం అనూహ్యంగా పెరుగుతోంది. ఆదివారం పోలవరం ప్రాజెక్టు స్పిల్వేలోకి చేరుకున్న 2,23,309 క్యూసెక్కుల అదనపు జలాలను అధికారులు దిగువకు విడుదల చేశారు. స్పిల్వే ఎగువన 28.220 మీటర్లు, దిగువన 18.740 మీటర్లు, కాపర్‌ డ్యాం ఎగువన 28.370 మీటర్లు, దిగువన 17.770 మీటర్లు, ఎగువ, దిగువ కాపర్‌ డ్యాంల మధ్య 15.680 మీటర్ల నీటి మట్టం నమోదైంది. పట్టిసీమ ఫెర్రీ రేవులో మెట్లపైకి వరద ప్రవహిస్తోంది.


వర్షాల కోసం రాష్ట్ర రైతుల ఎదురుచూపు

అల్పపీడనం ప్రభావం రాష్ట్రంపై పెద్దగా కనిపించడంలేదు. ఉత్తరకోస్తాలో అనేకచోట్ల మేఘాలు ఆవరించాయి తప్ప చెప్పుకోదగ్గ వర్షాలు కురవలేదు. మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగింది. రానున్న నాలుగు రోజుల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. నాలుగు రోజుల తరువాత బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నదని ఇస్రో వాతావరణ నిపుణుడు తెలిపారు. దీంతో ఉత్తరకోస్తాలో ఈనెల 11వ తేదీ నుంచి రెండు మూడురోజులు ఎక్కువచోట్ల వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఒడిశాకు దగ్గరగా అల్పపీడనాలు వస్తేనే ఉత్తరకోస్తా, ఉత్తర తెలంగాణ వరకు వర్షాలు కురుస్తాయని వివరించారు. నైరుతి రుతుపవనాలు ముందుగా వచ్చాయన్న సంతోషం రాష్ట్ర రైతుల్లో కనిపించడంలేదు. గతనెలలో 23.3 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. జూలైలో రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించినప్పటికీ మేఘాలు తప్ప వర్షం కురవడంలేదు. వచ్చేనెలలో రాష్ట్రంలో రుతుపవనాలు పుంజుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Updated Date - Jul 07 , 2025 | 01:52 AM