Heavy Flooding: కృష్ణానదికి భారీగా వరద
ABN , Publish Date - Aug 20 , 2025 | 04:24 AM
కృష్ణానదిలో వరద ఉధృతి పెరుగుతోంది.శ్రీశైలం డ్యాం నిండుకుండను తలపిస్తోంది. జూరాల, సుంకేసుల, హంద్రీ నుంచి 3,85,224 క్యూసెక్కుల వరద శ్రీశైలానికి వచ్చి చేరుతోంది.
ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి హెచ్చరిక జారీ
సముద్రంలోకి 4.66 లక్షల క్యూసెక్కులు
శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతలకు పెరిగిన వరద ఉధృతి
గోదావరిలో తగ్గుతూ, పెరుగుతూ ప్రవాహం
10 లక్షల క్యూసెక్కులకు పెరగొచ్చని అంచనా
బలహీనపడిన వాయుగుండం
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
కృష్ణానదిలో వరద ఉధృతి పెరుగుతోంది.శ్రీశైలం డ్యాం నిండుకుండను తలపిస్తోంది. జూరాల, సుంకేసుల, హంద్రీ నుంచి 3,85,224 క్యూసెక్కుల వరద శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, మంగళ వారం రాత్రి 882 అడుగులకు చేరింది. 198.81 టీఎంసీల నీరు నిల్వ ఉంది. దీంతో 10 క్రస్ట్‌గేట్లను 14 అడుగుల మేర ఎత్తి 3,45,240 క్యూసెక్కులు..కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ ఉత్పాదన ద్వారా 65,509 క్యూసెక్కుల నీటిని దిగువనున్న నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.అదేవిధంగా పోతిరెడ్డిపాడుకు 30 వేల క్యూసెక్కులు, హెచ్‌ఎన్‌ఎ్‌సఎ్‌సకు 2,818 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌లోకి 4,10,186 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. సాగర్ నీటిమట్టం 584.60 అడుగులకు చేరింది.సాగర్‌లో 296.28 టీఎంసీల నీరు నిల్వ ఉంది.దీంతో నాగార్జున సాగర్ 26 క్రస్ట్‌గేట్లను ఎత్తి 10 అడుగులు మేర ఎత్తి 3,61,322 క్యూసెక్కులు.. కుడి కాలువ ద్వారా 7528, ఎడమ కాలువ ద్వారా 4949, ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 33,007, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2400, ఎల్‌ఎల్‌సీ ద్వారా 300 క్యూసెక్కులు, మొత్తం ఔట్‌ఫ్లో 4,09,506 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.నాగార్జునసాగర్ నుంచి పులిచింతల ప్రాజెక్టుకు 3,97,807 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 4,13,395 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.ప్రకాశం బ్యారేజీకి 4,73,065 క్యూసెక్కుల వరద వస్తోంది.4 లక్షల క్యూసెక్కులు దాటడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.బ్యారేజీ 69 గేట్లను పూర్తిస్థాయిలోకి ఎత్తి 4,66,905 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి భారీగా పెరుగుతుండడంతో దిగువ నదీ తీర ప్రాంత వాసులు, లంక భూముల రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
నేడు గోదావరికి 10 లక్షల క్యూసెక్కులు?
ఎగువ ప్రాంతాల్లో గోదావరి నీటిమట్టం పెరుగుతుండగా ధవళేశ్వరం వద్ద తగ్గుతూ ప్రవహిస్తోంది. ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ నుంచి 8,23,083 క్యూసెక్కులు సముద్రంలోకి ప్రవహిస్తోంది.నీటిమట్టం 10.40 అడుగులకు చేరుకుంది. బుధవారం 10 లక్షల క్యూసెక్కుల వరకు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. ఎగువన శబరి ఉధృతితో ఛత్తీస్‌గడ్ - ఒడిసా నడుమ సుక్మా సమీపంలో శబరి నదిపై నిర్మించిన వంతెన నీట మునిగింది. అలాగే, మన రాష్ట్రం మీదుగా ఒడిసా వెళ్లే 30 నెంబరు జాతీయ రహదారి నిమ్మలగూడెం వద్ద నీట మునిగింది.భద్రాచలం వద్ద మంగళవారం సాయంత్రానికి నీటిమట్టం 36.00 అడుగులకు చేరింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వేలోకి అదనంగా వస్తున్న 8,00,702 క్యూసెక్కులను అధికారులు దిగువకు విడుదల చేశారు. కొల్లేరు వరద ఉధృతి స్వల్పంగా పెరిగింది. దీంతో లంక గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.
బలహీనపడిన వాయుగుండం
వాయుగుండం మంగళవారం ఉదయం ఒడిశాలోని గోపాల్‌పూర్ సమీపాన తీరం దాటింది. ఆ తర్వాత పశ్చిమ వాయవ్యంగా పయనించి ఒడిశా మీదుగా ఛత్తీస్‌గడ్‌లో ప్రవేశించే సమయానికి తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. ఇది బుధవారం ఉదయానికి మరింత బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది.రానున్న 24 గంటల్లో ఉత్తరకోస్తాలో అనేకచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది.మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. గురువారం నుంచి వర్షాలు క్రమేపీ తగ్గుతాయని తెలిపింది.బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.వరద ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం విజయవాడ కృష్ణాఘాట్, అవనిగడ్డ, చింతూరు, అమలాపురంలలో ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది.