Tirumala: తిరుమలలో పెరిగిన రద్దీ
ABN , Publish Date - Dec 28 , 2025 | 04:05 AM
తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. వరుస సెలవులు, ఈ ఏడాదికి వారాంతం కావడంతో శనివారం తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది.
సర్వ దర్శనానికి 14 గంటల సమయం
తిరుమల, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. వరుస సెలవులు, ఈ ఏడాదికి వారాంతం కావడంతో శనివారం తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. శ్రీవారి ఆలయ పరిసరాలు, అఖిలాండం, లడ్డూ కౌంటర్, బస్టాండ్, ప్రధాన కూడళ్లు, గదులు కేటాయించే రిసెప్షన్ కేంద్రాలు, తలనీలాలు సమర్పించే కల్యాణకట్టలు భక్తులతో కిక్కిరిసి కనిపించాయి. సర్వదర్శనం కోసం భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కాంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని షెడ్లలో నిండిపోయారు. క్యూలైన్ కృష్ణతేజ విశ్రాంతి భవనం మీదుగా రింగు రోడ్డులో శిలాతోరణం సర్కిల్ వరకు వ్యాపించింది. వీరికి 14 గంటల తర్వాత దర్శనం లభిస్తోంది. ఇక, టైంస్లాట్ టోకెన్లు, టికెట్లు ఉన్నవారికి దాదాపు 3 గంటల సమయం పడుతోంది. వరాహస్వామి ఆలయం ముందు భక్తులు ఎండలోనే నిలబడాల్సి వస్తోంది. ఉన్న షెడ్లు సరిపోక బయటకు క్యూలైన్ వ్యాపించింది.
ప్రదక్షిణకూ గేట్లు అడ్డు
ఇక సాధారణంగా తిరుమలకు వచ్చే భక్తుల్లో చాలా మందికి స్వామి దర్శనంతో పాటు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం ఆనవాయితీ. అయితే ప్రస్తుతం క్యూకాంప్లెక్స్‌కు అనుసంధానంగా ఉండే ఎలిఫెంట్ బిడ్జిపై నుంచి కాకుండా తిరుమల నంబి ఆలయం ముందు నుంచి అదనపు లైన్ ఏర్పాటు చేసి భక్తులను అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో మాడవీధుల్లో భక్తులెవ్వరూ ముందుకు వెళ్లకుండా గేట్లు వేస్తున్నారు. దీంతో భక్తులు మూసివేసిన గేట్లు చూసి నిరాశతో తిరిగి వెళ్లిపోతున్నారు.
రేపు అర్ధరాత్రి తెరుచుకోనున్న వైకుంఠ ద్వారాలు
1.30 గంటల నుంచి దర్శనాలు ప్రారంభం
తిరుమల, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. 30వ తేదీ వైకుంఠ ఏకాదశి నుంచి జనవరి 8 అర్ధరాత్రి వరకు వైకుంఠ ద్వారాలు తెరచి ఉంచుతారు. సోమవారం అర్ధరాత్రి సరిగ్గా 12.05 గంటలకు అర్చక, జీయర్ బృందం వైకుంఠ ద్వారాలు తెరువనున్నారు. అనంతరం నిత్య, ధనుర్మాస కైంకర్యాలు, నైవేద్యం, హారతి తదితర కార్యక్రమాలను పూర్తిచేసి 1.30 గంటల నుంచి దర్శనాలకు అనుమతిస్తారు. వేకువజాము 5.30 గంటలలోపు వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తి చేసి, ఆ తర్వాత ఆన్‌లైన్‌లో టోకెన్లు పొందిన భక్తులను అనుమతిస్తారు. జనవరి 2 నుంచి 8వ వరకు నేరుగా తిరుమలకు వచ్చినవారిని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 క్యూలైన్ ద్వారా దర్శనాలకు అనుమతిస్తారు.
విస్తృత ఏర్పాట్లు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
వైకుంఠ ద్వార దర్శనాలకు విస్తృత ఏర్పాట్లు చేసినట్టు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. శనివారం ఆయన శిలాతోరణం నుంచి కృష్ణతేజా సర్కిల్ వరకు క్యూలైన్లను తనిఖీ చేశారు. క్యూలైన్లలో ఏర్పాటు చేసిన్ల సౌకర్యాలను పరిశీలించి, భక్తులతో మాట్లాడారు. అనంతరం అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ.. భక్తులు క్యూలైన్లలో కూర్చుకునేందుకు ఏర్పాట్లు చేశామని, తాగునీటి సౌకర్యం, క్యూలైన్లకు అనుసంధానంగా అదనపు మరుగుదొడ్లు అందుబాటులోకి తెచ్చామన్నారు. చలి కాలం కావడంతో క్యూలైన్‌లో పంపిణీ చేసే అన్నప్రసాదాలు చల్లబడకుండా హాట్ కేసుల్లో ఉంచి వేడిగానే పంపిణీ చేసేలా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.