Tirumala Brahmotsavam: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
ABN , Publish Date - Oct 08 , 2025 | 04:45 AM
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పెరిగిన రద్దీ కొనసాగుతునే ఉంది. ప్రతిరోజు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని 9 షెడ్లు సర్వదర్శన భక్తులతో...
12 రోజుల్లో 8.90 లక్షల మందికి శ్రీవారి దర్శనం
తిరుమల, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పెరిగిన రద్దీ కొనసాగుతునే ఉంది. ప్రతిరోజు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని 9 షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోతున్నాయి. క్యూలైన్ కృష్ణతేజ విశ్రాంతి భవనం మీదుగా రింగురోడ్డులో శిలాతోరణం సర్కిల్, బాటగంగమ్మ సర్కిల్, ఆక్టోపస్ భవనం వరకు దాదాపు మూడు కిలోమీటర్ల మేరకు క్యూ వ్యాపిస్తోంది. రద్దీ రోజుల్లో అర్ధరాత్రి దాటాక భక్తులు క్యూలైన్‌లోకి చేరి ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 3 గంటల తర్వాత బాటగంగమ్మ ఆలయ సర్కిల్ సమీపంలోని క్యూలైన్‌కు తాళం వేసి.. అర్ధరాత్రి తర్వాత భక్తులను క్యూలైన్‌లోకి అనుమతిస్తున్నారు. మఽధ్యాహ్నం తర్వాత క్యూలైన్ వద్దకు వచ్చే భక్తులు అర్థరాత్రి వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక, క్యూలైన్‌లోకి ప్రవేశించిన భక్తులకు 14 నుంచి 20 గంటల దర్శన సమయం పడుతోంది. కాగా, గత నెల సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 7వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు.. 12 రోజుల్లో 8,90,500 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. గడిచిన 11 రోజుల్లో రూ.37.32 కోట్ల హుండీ ఆదాయం లభించగా, 3,33,234 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.
20న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 20న దీపావళి ఆస్థానం జరుగనుంది. సాయంత్రం 5 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్ప స్వామి సహస్ర దీపాలంకార సేవలో పాల్గొని నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతారు. దీపావళి ఆస్థానం నేపథ్యంలో కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.