Legislative Debate: మండలిలో ఇసుక దుమారం
ABN , Publish Date - Mar 12 , 2025 | 06:23 AM
ఇసుక అమ్మకాలపై మంగళవారం శాసనమండలిలో వాడివేడిగా చర్చ జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక విధానం వల్ల వేలాది మంది తీవ్రంగా నష్టపోయారని

అమరావతి, మార్చి 11(ఆంధ్రజ్యోతి): ఇసుక అమ్మకాలపై మంగళవారం శాసనమండలిలో వాడివేడిగా చర్చ జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక విధానం వల్ల వేలాది మంది తీవ్రంగా నష్టపోయారని, ఇసుక దొరక్క, పనిలేక వందల మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారథి, అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాతో వైసీపీ నేతలు వేల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. ఇసుక దోపిడీతో ప్రభుత్వానికి 1,250 కోట్లు నష్టం చేకూర్చారని మండిపడ్డారు. జిల్లా స్థాయిలో శాండ్ కమిటీల ద్వారా ఇసుక తవ్వకాలకు అనుమతిస్తున్నామని చెప్పారు. ఉచిత ఇసుక విధానంతో పేదవాడికి లబ్ధి చేకూరడం లేదని గతం కంటే పెద్దగా మార్పులేదని వైసీపీ సభ్యులు బొత్స సత్యనారాయణ, తోట త్రిమూర్తులు విమర్శించారు. గత ప్రభుత్వంలో విశాఖలో లారీ ఇసుక రూ.12 వేలకే దొరికేదని బొత్స చెప్పారు. బొత్స వ్యాఖ్యలపై మంత్రులు ధీటుగా జవాబిచ్చారు. గత ప్రభుత్వంలో టన్నుకు రూ.375 చొప్పున రీచ్ వద్దే వసూలు చేశారని, రవాణా ఖర్చుతో ధర ఎక్కువగా ఉండేదన్నారు. గత ప్రభుత్వంలో ట్రాక్టర్ ఇసుక రూ.8,500 ఉంటే ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో రూ.1,800కు ఇంటి వద్దకే చేరుస్తున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు. విశాఖలో గత ప్రభుత్వంలో లారీ ఇసుక రూ.50వేలకు అమ్మారని, ఇప్పుడు రూ.20వేలకే ఇంటికి చేరుతోందన్నారు. గత ఐదేళ్లలో రూ.12వేలకు లారీ ఇసుక దొరికిందన్నది అసత్యమని మంత్రి పార్థసారథి అన్నారు. వైసీపీ సభ్యులు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.