Andhra Pradesh Assembly: సభలో సినీ రగడ
ABN , Publish Date - Sep 26 , 2025 | 04:30 AM
శాసనసభ వేదికగా ‘సినీ’ రగడ రాజుకుంది. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ తీవ్రంగా స్పందించారు.
కామినేని వ్యాఖ్యలకు బాలకృష్ణ కౌంటర్
జగన్‌పై ధ్వజం.. చిరంజీవి ప్రస్తావన
బాలయ్య మాటలపై చిరు తీవ్ర స్పందన
అమరావతి, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): శాసనసభ వేదికగా ‘సినీ’ రగడ రాజుకుంది. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ తీవ్రంగా స్పందించారు. దీనికి ప్రతిస్పందనగా చిరంజీవి సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. జగన్ సీఎంగా ఉండగా సినీ ప్రముఖులను అవమానించారని... ఆయన వైఖరికి ఇదొక ఉదాహరణ అని కామినేని శ్రీనివాస్ గురువారం సభలో పేర్కొన్నారు. దీనిపై వారి వ్యాఖ్యలు, స్పందన, ప్రతిస్పందనలు ఇవి...
చిరంజీవి గట్టిగా అడిగితే...: కామినేని
జగన్మోహన్‌రెడ్డిది ఎంత సైకో మనస్తత్వమంటే.. చిరంజీవిని, ఆయన భార్య సురేఖను ఒకసారి రమ్మంటే వెళ్లినప్పుడు కారు పోర్టికోలోకి వెళ్లగానే జగన్ దంపతులు వచ్చి లోపలకు తీసుకెళ్లారు. తర్వాత సినిమా వాళ్ల సమస్యలపై చర్చించాలని అడిగితే ఆయనే (జగన్) జాబితా పంపారు. ఆ జాబితాలో బాలకృష్ణ, ఇతరులెవరూ లేరు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఉంటున్న ప్రభాస్, మహేష్, రాజమౌళిని రమ్మన్నారు.. వాళ్లు రాబోమన్నా చిరంజీవి గారే రమ్మని అడగడంతో మొహమాటంతో వస్తే.. ఫస్ట్ షాక్. గేటు దగ్గరే కార్లు ఆపేశారు. అందరినీ కార్లు దిగి రమ్మన్నారు. అదేంటనుకుని కార్లు దిగి లోపలకు వెళ్లారు. లోపల సెకండ్ షాక్. ఇంత పెద్దవారిని పిలిచి అక్కడ పోసాని కృష్ణమురళి లాంటి వారిని కూర్చోబెట్టారు. తర్వాత మూడో షాక్. సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు.. సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మాట్లాడతారని అన్నారు అప్పుడు చిరంజీవి గారు కొద్దిగా గట్టిగానే.. అదేంటండి.. మీరు పిలిచారని నేను వీరందరినీ తీసుకొస్తే ఆయన రానంటారా.. అని అడిగారు. అప్పుడు జగన్ వచ్చారు. మీరొక తండ్రిలా సినిమా పరిశ్రమను జాగ్రత్తగా చూసుకోండని చిరంజీవి మంచిఉద్దేశంతో రిక్వెస్ట్ చేస్తే.. ఆ వీడియో బయటకు రిలీజ్ చేశారు. ఎంత అవమానం? శాడిస్ట్ మెంటాలిటీకి ఇంతకన్నా ఉదాహరణ ఏమి కావాలి?’
గట్టిగా ఎవరడిగారు: బాలకృష్ణ
అప్పుడు ఇండస్ట్రీ వాళ్లందరూ సైకో గాడిని కలవడానికి వెళ్లినప్పుడు చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన (జగన్) వచ్చాడు అన్నది అబద్ధం. అక్కడ గట్టిగా ఎవ్వడూ అడగలేదు.. సినిమాటోగ్రఫీ మంత్రిని కలవమన్నారు.. ఆ వీడియో పెట్టడం, అవమానించడం నిజం. ఆయన (చిరు) ఏదో పెద్దగా చెబితే ఈయన (జగన్) దిగొచ్చాడంటా.. మొన్న కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది. ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ జాబితా తయారు చేయమని! అందులో నాది తొమ్మిదో పేరు! మంత్రి కందుల దుర్గేశ్ గారిని అడిగా.. ఎవడు వాడు వేసిందని! మర్యాద ఇవ్వడం మానవత్వం. (కామినేని వైపు చూస్తూ..) అదేదో గట్టిగా.. ఎవడడిగాడు? గట్టిగా అడిగితే పంపించారా లోపలికి! ఆ రోజు గట్టిగా అడిగిన వారెవరూ లేరు. మీరు తెలీకుండా మాట్లాడుతున్నారు. అయితే ఆయన(చిరంజీవి)కు అవమానం జరిగింది వాస్తవమే. (స్పీకర్ వైపు చూస్తూ..) సారీ.. వివరణ ఇవ్వడమే నా ఉద్దేశం!’
బాలకృష్ణ అందుబాటులో లేరు: చిరంజీవి
‘ఏపీలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలోని కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిల్మ్ చాంబర్ ప్రతినిధులు నా దగ్గరకు వచ్చి, నిర్మాణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా టికెట్ల ధరల పెంపుదల గురించి ప్రభుత్వంతో మాట్లాడమని నన్ను కోరారు. వారిలో దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, హీరోలు మహేశ్, ఎన్టీఆర్, నిర్మాత డీవీవీ దానయ్య తదితరులు ఉన్నారు. వారి సూచనల మేరకు అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో ఫోన్‌లో మాట్లాడాను. సీఎంతో చర్చించి చెబుతానని ఆయన చెప్పారు. ఆ తర్వాత మంత్రి నాకు ఫోను చేసి... జగన్ వన్ టు వన్ కలుస్తారని చెప్పి, లంచ్‌కి ఆహ్వానించారు. నేను సీఎం నివాసానికి వెళ్లగా ఆయన నన్ను సాదరంగా ఆహ్వానించారు. జగన్‌కు సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని వివరించాను. సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని తెలిపాను. కొన్ని రోజుల తర్వాత మంత్రి పేర్ని నాని ఫోన్ చేసి కొవిడ్ రెండో దశ కొనసాగుతున్నందు వల్ల ఐదుగురు మాత్రమే వస్తే బాగుంటుందని చెప్పారు. నేనప్పుడు ఓ పదిమందిమి వస్తామని చెబితే సరేనన్నారు. ఆ సమయంలో బాలకృష్ణను ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను. ఆయన అందుబాటులోకి రాలేదు. బాలకృష్ణను కలవమని జెమిని కిరణ్‌ను పంపించాను. ఆయన మూడు సార్లు ప్రయత్నించినా బాలకృష్ణను కలవలేకపోయారు. దాంతో నేను ఓ విమానం ఏర్పాటు చేసి ఆర్. నారాయణమూర్తితో సహా మరికొందరితో వెళ్లి సీఎంను కలిశాం. సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని వివరించి, ప్రభుత్వ సహకారం కోరాను. నేను చొరవ తీసుకోవడం వల్లే అప్పుడు ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు అంగీకరించింది. ఆ నిర్ణయం వల్లే ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ నటించిన ‘వీరసింహా రెడ్డి’ వంటి సినిమాలకు టికెట్ రేట్లు పెంచడానికి కారణమైంది. నేను సీఎంతోనైనా, సామాన్యుడితో అయినా నా సహజ ధోరణిలోనే మాట్లాడుతాను.’