Privatization Debate: మండలిలో మంటలు
ABN , Publish Date - Sep 24 , 2025 | 05:08 AM
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంపై మంగళవారం శాసనమండలి అట్టుడికింది. ప్రైవేటీకరణ జరగదని మంత్రి లోకేశ్ పునరుద్ఘాటించారు.
విశాఖ ఉక్కు, ఫీజు బకాయిలపై వాడీవేడి చర్చ
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదు.. వందసార్లు చెప్పినా అర్థం కాదా?
ప్లాంటును కాపాడుకోడానికి 14 వేల కోట్లు తెచ్చాం.. వైసీపీపై లోకేశ్ ధ్వజం
ప్రైవేటీకరణ జరగాలని వైసీపీయే కోరుకుంటున్నట్లుగా ఉందని ఆగ్రహం
తమ సభ్యురాలిని అవమానించారని బొత్స ఆరోపణ.. లోకేశ్ మండిపాటు
నా తల్లిని అవమానించినప్పుడు సభలోనే ఉండి మీరేం చేశారు?
ఆమె ఎంత కుమిలిపోయిందో నాకు తెలుసు.. మహిళలను తిడితే ఆనందపడే వ్యక్తులం కాదు.. మా నేత అలాంటి సంస్కారం నేర్పలేదు
ఎమ్మెల్సీని ‘కల్యాణిగారు’ అనే అన్నాను.. రికార్డులు పరిశీలించండి: మంత్రి
ఫీజు బకాయిలపై చర్చకు సిద్ధమా అంటూ వైసీపీకి సవాల్
అమరావతి, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంపై మంగళవారం శాసనమండలి అట్టుడికింది. ప్రైవేటీకరణ జరగదని మంత్రి లోకేశ్ పునరుద్ఘాటించారు. ఐదేళ్లపాటు వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని.. కూటమి వచ్చాక ప్రైవేటీకరణను నిలిపివేశామని.. స్టీల్ ప్లాంట్‌ను రక్షించుకోవడానికి రూ.14 వేల కోట్లు తీసుకొచ్చామని చెప్పారు. ‘విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని వంద సార్లు చెప్పాం. ప్రభుత్వం తరఫున అంత స్పష్టంగా చెప్పినా మీకు (వైసీపీ) అర్థం కావడం లేదా? ప్రైవేటీకరణ జరగాలని మీరే కోరుకుంటున్నట్లుగా ఉంది. అసత్య ప్రచారాలు చేయడమే పనిగా పెట్టుకున్నారు’ అని వైసీపీ ఎమ్మెల్సీలపై లోకేశ్ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పెట్టుబడుల కల్పన, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రస్తుత పరిస్థితిపై లఘు చర్చ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అడిగిన ప్రశ్నకు లోకేశ్ సమాధానమిచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని మీరే చెప్పి, మళ్లీ సభను తప్పుదారి పట్టిస్తున్నారని, ఎందుకు రభస చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ క్రమంలో తమ సభ్యురాలిపై ఆయన అసభ్య పదజాలం వాడారని, వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.
ఆయనవ్యాఖ్యలపై లోకేశ్ మండిపడ్డారు. ‘వైసీపీ ప్రభుత్వంలో నిండు సభలో నా తల్లిని అవమానించారు. అప్పుడు మంత్రిగా ఉన్న బొత్స సభలోనే ఉండి ఏం చేశారు? ఓ తల్లిని అవమానిస్తే ఎంత బాధ ఉంటుందో కొడుకుగా నాకు తెలుసు. మా అమ్మ ఎంత కుమిలిపోయిందో నాకు తెలుసు. ఆమె కోలుకోవడానికి మూడు నెలలు పట్టింది.. ఆనాడు మీవాళ్లు ఏమన్నారో వీడియో చూపించాలా? నేను సభ్యురాలిని వరుదు కల్యాణి గారు అనే గౌరవించా. కావాలంటే రికార్డులు పరిశీలించండి.. మహిళలంటే నాకు అపార గౌరవం. మహిళలను తిడితే ఆనందపడే వ్యక్తులం మేం కాదు. మా నాయకుడు అలాంటి సంస్కారం మాకు నేర్పలేదు’ అని స్పష్టంచేశారు. బొత్స స్పందిస్తూ.. అప్పుడు, ఇప్పుడు తాను ఖండిస్తున్నానని.. మహిళను ఎవరు కించపరిచేలా మాట్లాడినా తప్పేనని అన్నారు. అయితే ఆ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవద్దని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలను బొత్స ఉపసంహరించుకోవాలని హోం మంత్రి అనిత డిమాండ్ చేశారు.
ప్రధానికి ధన్యవాదాలు..
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదని లోకేశ్ ప్రకటించినా తమకు అనుమానాలు ఉన్నాయంటూ వైసీపీ సభ్యులు పదే పదే ప్రస్తావించడంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సమయంలోనే లోకేశ్ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ప్రతిపాదించారు. ‘విశాఖ ఉక్కు కర్మాగారానికి రూ.11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉక్కు మంత్రి కుమారస్వామికి ధన్యవాదాలు. రాష్ట్ర ప్రజల గుండెల్లో ఎన్‌డీఏ ప్రభుత్వం చిరస్మరణీయంగా ఉంటుంది. మూడో ఫర్నేస్ కూడా వినియోగంలోకి వచ్చింది. విద్యుత్ చార్జీల కింద కర్మాగారం చెల్లించాల్సిన రూ.3 వేల కోట్లను ఈక్విటీ కింద ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని ఆమోదం తెలిపి కుమారస్వామి గారికి పంపాలని కోరుతున్నాను. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో నేను కూడా పాల్గొన్నాను. ప్రైవేటీకరణ జరగదని.. ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుందని ఆనాడు హామీ ఇచ్చాం.. ఆ హామీకి మా మూడు పార్టీలు కట్టుబడి ఉన్నాయి’ అని పేర్కొన్నారు. వైసీపీ దీనికి మద్దతిస్తుందో లేదో చెప్పాలని సూటిగా నిలదీయడంతో ఆ పార్టీ సభ్యులు సంపూర్ణంగా మద్దతిచ్చారు. అనంతరం తీర్మానాన్ని మండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. అయితే పోటీగా వైసీపీ మరో తీర్మానం ప్రతిపాదించింది. ‘ప్రజల సెంటిమెంటును దృష్టిలో ఉంచుకుని విశాఖ ఉక్కు కర్మాగారంలో పెట్టుబడుల ఉపసంహరణకు అవకాశం లేకుండా పూర్తి వాటా ప్రభుత్వానికే ఉంచుకుని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి. క్యాప్టివ్ గనులు కేటాయించాలి. విశాఖ ఉక్కు కర్మాగాన్ని పునరుద్ధరించాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని కోరాలి’ అని అందులో పేర్కొన్నారు. ఈ తీర్మానంలో కొన్ని పదాలపై తమకు అభ్యంతరం ఉందని.. వాటిని సవరిస్తే ఆమోదం తెలపడానికి తమకు అభ్యంతరం లేదని అధికార పక్షం స్పష్టం చేసింది. లోకేశ్ జోక్యం చేసుకుని.. ‘అసలు విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ఎక్కడ? దానిని ఇప్పటికే పునరుద్ధరించాం.
వైసీపీ తీర్మానం అసందర్భంగా ఉంది. ఆరు నెలల ముందు పెట్టి ఉంటే సందర్భోచితంగా ఉండేది. అప్పుడు తయారుచేసిన ప్రతిని ఇప్పుడు తీసుకొచ్చారు’ అని వ్యాఖ్యానించారు. తమ తీర్మానాన్ని సవరణలు లేకుండా ఆమోదించాల్సిందేనని.. లేకుంటే ఓటింగ్‌కు వెళ్తామని బొత్స ప్రకటించారు. దీనిపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్పందిస్తూ.. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఏం చేస్తున్నామో లోకేశ్ ఇప్పటికే స్పష్టంగా చెప్పారని.. తమ తీర్మానాన్ని ఉపసంహరించుకుంటారా లేదా అనేది వైసీపీ విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. తర్వాత ఆ తీర్మానాన్ని మండలి చైర్మన్ తీసుకుని టేబుల్‌పై ఉంచారు. ఓటింగ్‌కు పెట్టలేదు.మొత్తానికి విశాఖ ఉక్కుపై వైసీపీ అస్పష్ట వైఖరితో సెల్ఫ్ గోల్ వేసుకుందన్న వ్యాఖ్యలు వినవచ్చాయి, మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమైన లఘు చర్చ సాయంత్రం 4.22 గంటల వరకు సుదీర్ఘంగా సాగడం గమనార్హం.
అప్పుడు, ఇప్పుడు కాపాడింది ఎన్‌డీఏనే..
‘గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడింది టీడీపీ, బీజేపీయే. 1998లోనే రూ.1350 కోట్లు కేటాయించి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా కాపాడుకున్నాం. ఆ ట్రాక్ రికార్డ్ మాకు ఉంది. కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది. అందరితో చర్చించాం. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కనుకే ఏపీకి మినహాయింపు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి రూ.11,500 కోట్లు కేటాయించింది. ఈ విషయంలో సీఎం చంద్రబాబు ప్రధాని మోదీని కలిశారు. నిర్మలా సీతారామన్‌తో రాత్రి 12.38 గంటలకు భేటీ అయ్యారు. మా దగ్గర ఫొటో ఉంది. కావాలంటే మీకు పంపిస్తా.. ఆ మీటింగ్‌లో ప్రైవేటీకరణ జరగకూడదని రివైవల్ ప్యాకేజీ ప్రకటించారు. కుమారస్వామి, నిర్మలా సీతారామన్,. ప్రధాని మోదీ ముగ్గురు కలిసి విశాఖ ఉక్కుకు పెద్దఎత్తున నిధులు కేటాయించి ఆదుకున్నారు. ఇదీ మా ప్రభుత్వ చిత్తశుద్ధి. మేమెప్పుడూ కేసుల మాఫీ కోసం ఢిల్లీ గడప తొక్కలేదు. ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా రాష్ట్రం గురించే అడిగామే గానీ.. సొంత ప్రయోజనాల కోసం అడగలేదు. రూ.11,500 కోట్లలో ఇప్పటికి రూ.9,800 కోట్లు ప్లాంటు ఖాతాలో డిపాజిట్ చేసిన ఘనత కూడా ఎన్‌డీఏ ప్రభుత్వానిదే. వైసీపీ హయాంలో ఒకే ఫర్నిస్ నడిచేది. ఉత్పాదన సామర్థ్యం ఆనాడు కేవలం 48 శాతం. సుమారు రూ.25 వేల కోట్లు అప్పు ఉండేది. ఇప్పుడు మేం మూడు ఫర్నిస్‌లను యాక్టివేట్ చేశాం. దాదాపు 80 శాతం కెపాసిటీ యుటిలైజేషన్‌కు తీసుకొచ్చాం’ అని లోకేశ్ చర్చ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉర్సాకు రూపాయికే ఎకరం ఇచ్చారన్న బొత్స
నిరూపిస్తే రాజీనామా చేస్తానని లోకేశ్ సవాల్
పరిశ్రమలకు విలువైన భూములు ధారాదత్తం చేస్తున్నారని.. ఉర్సా కంపెనీకి రూపాయికే ఎకరం భూమి కట్టబెట్టారని బొత్స ఆరోపించారు. దీనిని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని లోకేశ్ సవాల్ చేశారు. ‘టీసీఎస్, కాగ్నిజెంట్ కంపెనీలకు మాత్రమే రూపాయికి భూ ములు ఇచ్చాం. ఇక ఏ కంపెనీలకూ ఇవ్వలేదు. ఈ రెండు కంపెనీలకు భూములు ఇవ్వొచ్చో లేదో బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇవ్వాలి. మళ్లీ అధికారంలోకి వ స్తే కూటమి ప్రభుత్వం పరిశ్రమలకు కేటాయించిన భూములను రద్దు చేస్తామని వైసీపీ బెదిరిస్తోంది. టీసీఎస్ దీని గురించి అడుగుతోంది. దీనిపై బొత్స స్పష్టత ఇవ్వాలి’ అని నిలదీశారు. టీసీఎస్, కాగ్నిజెంట్ 25 వేల చొప్పున ఉద్యోగాలు కల్పిస్తాయని.. రూ.15 వేల కోట్ల విలువైన ఆర్థిక కార్యకలాపాలు జరుగుతాయని చెప్పారు.