Kurnool Kaveri Bus Accident: కన్నీటి కథలు
ABN , Publish Date - Oct 26 , 2025 | 06:25 AM
కర్నూలు సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో ఒంగోలుకు చెందిన బొంతా ఆదిశేషగిరిరావు(48) మృతిచెందారు.
బదిలీపై బెంగళూరు వెళ్తూ ఒంగోలు వాసి మృతి
ఇంటర్వ్యూకు వెళ్తూ తమిళనాడు యువకుడు కూడా
ఒంగోలుక్రైం/చెన్నై, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): కర్నూలు సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో ఒంగోలుకు చెందిన బొంతా ఆదిశేషగిరిరావు(48) మృతిచెందారు. హైదరాబాద్ ఐవోసీలో ఆయన మేనేజర్‌గా పనిచేసేవారు. ఆయనకు భార్య, కుమార్తె, కొడుకు ఉన్నారు. ఇటీవల ఆయనకు బెంగళూరుకు బదిలీ కావడంతో గురువారం రాత్రి బయల్దేరారు. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో సజీవ దహనమయ్యారు. ఒంగోలులో వారి బంధువులు లేరు. స్థానిక సుజాతనగర్‌లో నివాసం ఉన్న మిత్రుడు జీవీ సత్యనారాయణ ప్రమాద విషయం తెలిసిన వెంటనే కర్నూలు వెళ్లారు.
అదే చివరి ఫోన్ కాల్
బస్సు ప్రమాద మృతుల్లో తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లా పూలువపట్టి తోటత్తుపాళయానికి చెందిన యువకుడు యువన్ శంకర్ రాజా (23) ఉన్నారు. బీఎస్సీ చేసిన అతడు ఆర్నెల్ల క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు మందుల కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఉద్యోగంలో చేరిన నెల రోజులకు సొంతూరుకు వచ్చి తల్లిదండ్రులను చూసి వెళ్లారు. అప్పటి నుంచి మళ్లీ తల్లిదండ్రుల వద్దకు వచ్చేందుకు సెలవు దొరకలేదు. తమిళనాడులోనే ఏదో ఒక చోట పని చేయాలని నిర్ణయించుకున్నారు. సేలంలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోగా, ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చింది. ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లి, అక్కడి నుంచి సేలం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం ఇంటర్వ్యూ ఉందని, అందుకోసం బాగా ప్రిపేరవుతున్నానంటూ ముందురోజు తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారు. ఇంతలోనే బస్సు ప్రమాదంలో మరణించారు.