Share News

Heart Wrenching Movement: ఎంత కష్టం.. ఎంత కష్టం

ABN , Publish Date - Sep 02 , 2025 | 06:57 AM

పదిరోజులుగా విలీన మండలాల్లో వరదల కారణంగా లోతట్టు ప్రాంతవాసులు పడుతున్న కష్టాలకు ఈ ఘటన నిదర్శనం. రోడ్డు మార్గంలో భార్య మృతదేహాన్ని తీసుకువచ్చే...

Heart Wrenching Movement: ఎంత కష్టం.. ఎంత కష్టం

  • నాటుపడవపై మృతదేహం తరలింపు

  • విలీన మండలాల్లో వరదల కారణంగా పొంగుతున్న సోకిలేరు, చీకటి వాగులు

  • భద్రాచలం నుంచి భార్య మృతదేహాన్ని తరలించేందుకు భర్త అగచాట్లు

చింతూరు, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): పదిరోజులుగా విలీన మండలాల్లో వరదల కారణంగా లోతట్టు ప్రాంతవాసులు పడుతున్న కష్టాలకు ఈ ఘటన నిదర్శనం. రోడ్డు మార్గంలో భార్య మృతదేహాన్ని తీసుకువచ్చే వీలు లేక ఓ వ్యక్తి గత్యంతరం లేని పరిస్థితిలో నాటు పడవపై వాగులు దాటి.. ఆ తర్వాత అటవీ మార్గంలో ట్రాక్టర్‌పై ఇంటికి చేర్చుకున్న దయనీయ పరిస్థితి ఇది. అల్లూరి జిల్లా వరరామచంద్రపురం మండలం రామవరానికి చెందిన కుంజా రాములమ్మ(60) కొద్దికాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం ఆమె పరిస్థితి విషమంగా మారడంతో భర్త బుచ్చిరాజు తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం ఏరియా వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె సోమవారం మృతి చెందింది. ఇటీవలి వరదల కారణంగా సోకిలేరు, చీకటివాగులు పొంగుతుండటంతో రాములమ్మ మృతదేహాన్ని భద్రాచలం నుంచి వరరామచంద్రపురం మండలానికి నేరుగా రోడ్డు మార్గంలో తీసుకురావడానికి ఆటంకాలు ఎదురయ్యాయి. దీంతో సోకిలేరు వాగు మీదుగా కొంతదూరం నాటు పడవపై భార్య మృతదేహాన్ని తీసుకువచ్చిన బుచ్చిరాజు అక్కడి నుంచి చింతూరు అటవీమార్గంలో ట్రాక్టర్‌పై ఇంటికి తరలించారు.

Updated Date - Sep 02 , 2025 | 06:57 AM