Tirupati: 12 ఏళ్ల చిన్నారికి 35 ఏళ్ల వ్యక్తి గుండె
ABN , Publish Date - Nov 09 , 2025 | 04:55 AM
ఓవైపు గుంటూరులో బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి కుటుంబంలో అంతులేని శోకం.. మరోవైపు తిరుపతిలో ఇంకా ఈ లోకం ఎరుగని ఓ చిన్నారికి గుండె మార్పిడి చికిత్స కోసం ఎదురుచూపు..
బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి కుటుంబ సభ్యుల ఔదార్యం
గ్రీన్ చానల్ ద్వారా గుంటూరు నుంచి తరలింపు
తిరుపతిలో శస్త్రచికిత్స ప్రారంభం
తిరుపతి(వైద్యం), నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఓవైపు గుంటూరులో బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి కుటుంబంలో అంతులేని శోకం.. మరోవైపు తిరుపతిలో ఇంకా ఈ లోకం ఎరుగని ఓ చిన్నారికి గుండె మార్పిడి చికిత్స కోసం ఎదురుచూపు.. ఈ రెండింటి మధ్య జరిగిన ఉద్వేగభరితమైన క్షణాలు అందరినీ పరుగులు పెట్టించింది. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 12 ఏళ్ల బాలుడికి 35 ఏళ్ల వ్యక్తి గుండెను అమర్చే శస్త్రచికిత్స శనివారం రాత్రి తిరుపతిలో చేపట్టారు. బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి కుటుంబ సభ్యులు తీరని శోకంలో ఉన్నప్పటికీ.. బాలుడి పట్ల వారి ఔదార్యంతో ఇది సాధ్యమైంది. వివరాలిలా ఉన్నాయి. గుంటూరుకు చెందిన అబ్రహం(35) రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన్ను పరీక్షించిన గుంటూరులోని రమేష్ ఆస్పత్రి వైద్యులు బ్రెయిన్ డెడ్‌కు గురైనట్లు నిర్ధారించారు. బాధితుడి కుటుంబ సభ్యులకు వివరించి అవయవదానంపై అవగాహన కల్పించగా, వారు అంగీకరించారు. వెంటనే ఆస్పత్రి నిర్వాహకులు ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కర్నూలు జిల్లా నందికోట్కూరుకు చెందిన 12 ఏళ్ల బాలుడు కొంత కాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ రెండు వారాలుగా తిరుపతిలోని శ్రీపద్మావతి హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాలుడికి గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు నిర్ధారించి అతడి వివరాలను జీవన్‌ధాన్ పోర్టల్‌లో నమోదు చేశారు. అబ్రహం గుండెను దానం చేయడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయం తెలుసుకున్న హృదయాలయ డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి తన బృందంతో కలిసి గుంటూరుకు చేరుకున్నారు. అక్కడ బ్రెయిన్‌డెడ్‌కు గురైన అబ్రహం నుంచి గుండెను సేకరించారు. అంబులెన్సులో గ్రీన్ చానల్ ద్వారా గన్నవరం ఎయిర్‌పోర్టుకు, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో శనివారం సాయంత్రం 7.50 గంటలకు బయల్దేరి 9.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ్నుంచి ప్రత్యేక అంబులెన్సులో గ్రీన్‌చానల్ ద్వారా 9.50 గంటలకు శ్రీపద్మావతి హృదయాలయ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆ గుండెను ఆపరేషన్ థియేటర్‌లోకి గుండె మార్పిడి శస్త్ర చికిత్స ప్రారంభించారు.