Share News

Minister Satya kumar Yadav: గుండె జబ్బుల వల్లే 20శాతం మరణాలు

ABN , Publish Date - Sep 30 , 2025 | 05:07 AM

ప్రపంచంలో 20 శాతం మరణాలకు గుండె జబ్బులే కారణమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని..

Minister Satya kumar Yadav: గుండె జబ్బుల వల్లే 20శాతం మరణాలు

  • ప్రజల ఆరోగ్య సంరక్షణే కూటమి ప్రభుత్వ ధ్యేయం

  • ఎన్టీఆర్‌ వైద్యసేవకు 15 నెలల్లోనే రూ.4,350 కోట్లు

  • వచ్చే ఏడాది అనంతపురం,కాకినాడల్లో క్యాన్సర్‌ కేంద్రాలు

  • వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌

అనంతపురం వైద్యం, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రపంచంలో 20 శాతం మరణాలకు గుండె జబ్బులే కారణమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, సీఎం చంద్రబాబు నాయకత్వంలో 15 నెలల్లోనే ఎన్టీఆర్‌ వైద్యసేవకు రూ.4,350 కోట్లు ఖర్చుపెట్టడం దీనికి నిదర్శనమని చెప్పారు. ‘వరల్డ్‌ హార్ట్‌ డే’ సందర్భంగా అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌లో కార్డియాలజీ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సుభాష్‌ చంద్రబోస్‌ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ప్రపంచవ్యాప్తంగా అధిక మరణాలు గుండె జబ్బుల వల్లే సంభవిస్తున్నాయని, క్యాన్సర్‌ మరణాలు ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయని చెప్పారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్డియాలజీ విభాగాలను అభివృద్ధి చేసి, క్యాథ్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఒంగోలు, కడపలో ఇప్పటికే క్యాథ్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేశామన్నారు. కూటమి ప్రభుత్వం చేసిన ఎన్టీఆర్‌ వైద్యసేవ ఖర్చు రూ.4,350 కోట్లలో... రూ.1,004 కోట్లు గుండె శస్త్ర చికిత్సలకే వెచ్చించిందని తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న హృద్రోగులను కాపాడేందుకు 238 ఏరియా, జిల్లా స్థాయి ఆస్పత్రుల్లో రూ.45 వేల ఖరీదైన ఇంజెక్షన్లను అందుబాటులో ఉంచామని, వీటి ద్వారా ఈ 15 నెలల్లో 3,450 మంది ప్రాణాలు కాపాడగలిగామని మంత్రి వివరించారు.


క్యాన్సర్‌ పరీక్షలు చేయించుకోవాలి

ఐసీఎంఆర్‌ నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా 15.60 లక్షల మంది క్యాన్సర్‌ బాధితులు ఉన్నారని, అందుకే ప్రభుత్వాస్పత్రుల్లో క్యాన్సర్‌ చికిత్సల ప్రక్రియను బలోపేతం చేశామని మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. కర్నూలులో క్యాన్సర్‌ సెంటర్‌, విశాఖపట్నంలో ఖరీదైన రేడియాలజీ కేంద్రం, కడపలో క్యాన్సర్‌ కేంద్రం, గుంటూరులో ప్రథమ స్థాయి (లెవెల్‌-1) క్యాన్సర్‌ సెంటర్‌ను ప్రారంభించామని చెప్పారు. వచ్చే ఏడాది అనంతపురం, కాకినాడల్లోనూ క్యాన్సర్‌ సెంటర్లు నిర్మించబోతున్నామని తెలిపారు. రాష్ట్రంలో 4.16 కోట్ల మందికి ఉచిత క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. అయితే గ్రామాల్లో అవగాహన లేని కారణంగా పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రావడంలేదని అన్నారు. ప్రతి యువతి, మహిళ ముందుకొచ్చి క్యాన్సర్‌ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కియ పరిశ్రమ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద ప్రభుత్వ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి అధునాతన సాంకేతిక గుండె శస్త్రచికిత్స యంత్రాలను అందించిందని తెలిపారు. వాటిని వినియోగించి, 100 ఐవీయూఎస్‌, 500 యాంజియోగ్రామ్‌ ప్లాస్టీ సర్జరీలు చేసి రోగుల ప్రాణాలు కాపాడిన కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ సుభాష్‌ చంద్రబోస్‌, ఆయన బృందాన్ని అభినందిస్తున్నాని మంత్రి సత్యకుమార్‌ తెలిపారు.

Updated Date - Sep 30 , 2025 | 05:08 AM