ACB Court: సజ్జల శ్రీధర్‌రెడ్డి పిటిషన్‌పై విచారణ 17కు వాయిదా
ABN , Publish Date - Nov 14 , 2025 | 05:59 AM
మద్యం కుంభకోణం కేసులో తాను దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌కు నెంబర్ కేటాయించి విచారణ జరిపేలా ఏసీబీ కోర్టును ఆదేశించాలని కోరుతూ నిందితుడు సజ్జల శ్రీధర్‌రెడ్డి....
అమరావతి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో తాను దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌కు నెంబర్ కేటాయించి విచారణ జరిపేలా ఏసీబీ కోర్టును ఆదేశించాలని కోరుతూ నిందితుడు సజ్జల శ్రీధర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈనెల 17వ తేదీకి వాయిదా వేసింది. వ్యాజ్యంలో లేవనెత్తిన అన్ని అంశాలను ఆ రోజు పరిశీలించి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. సజ్జల శ్రీధర్‌రెడ్డి(ఏ6) బుధవారం హైకోర్టులో వేసిన ఈ పిటిషన్ గురువారం విచారణకు రాగా శ్రీధర్‌రెడ్డి తరఫున న్యాయవాది అభయ్ సిద్ధాంత్ వాదనలు వినిపించారు. కేసులోని ఇతర నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా మెరిట్స్ ఆధారంగా వారి బెయిల్ పిటిషన్లపై విచారణ జరపాలని చెప్పిందని, ఈ నేపథ్యంలో తాను డిఫాల్ట్ బెయిల్ కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశానని తెలిపారు. అయితే, రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను మాత్రమే విచారించాలని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరపలేమంటూ ఏసీబీ కోర్టు తన పిటిషన్‌ను రిటర్న్ చేసిందన్నారు. విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.