Share News

High Court: బాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

ABN , Publish Date - Dec 02 , 2025 | 04:25 AM

రాజధాని అసైన్డ్‌ భూముల వ్యవహారంలో సీఐడీ తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు, అప్పటి మాజీ మంత్రి పి.నారాయణ దాఖలు చేసిన వ్యాజ్యాలపై...

High Court: బాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

  • ఏఏజీగా పనిచేసిన పొన్నవోలు ఫిర్యాదుదారు తరఫున వాదించడంపై లూథ్రా అభ్యంతరం

అమరావతి, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): రాజధాని అసైన్డ్‌ భూముల వ్యవహారంలో సీఐడీ తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు, అప్పటి మాజీ మంత్రి పి.నారాయణ దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణను హైకోర్టు 10వ తేదీకి వాయిదావేసింది. ఫిర్యాదుదారు ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హాజరుకావడంపై పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అదనపు అడ్వకేట్‌ జనరల్‌(ఏఏజీ) హోదాలో గతంలో సీఐడీ తరఫున హాజరైన పొన్నవోలు.. ఇప్పుడు ఫిర్యాదుదారు తరఫున హాజరుకావడం బార్‌ కౌన్సిల్‌ నిబంధనలకు విరుద్ధమని కోర్టుకు నివేదించారు. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫున హాజరుకావడాన్ని పొన్నవోలు సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఇరుపక్షాల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్‌ వై.లక్ష్మణరావు.. ఫిర్యాదుదారు తరఫున పొన్నవోలు హాజరుకావచ్చా లేదా అనే విషయాన్ని తదుపరి విచారణలో తేలుస్తామని తెలిపారు. విచారణను ఈ నెల 10కి వాయిదా వేశారు. రాజధాని అసైన్డ్‌ భూముల వ్యవహారంలో అప్పటి వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 2021 ఫిబ్రవరి 24 ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ పోలీసులు చంద్రబాబు, పి.నారాయణపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంతో పాటు ఏపీ అసైన్డ్‌ భూముల బదిలీ నిరోధక చట్టం, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వాటిని కొట్టివేయాలని కోరుతూ వారిద్దరూ వ్యాజ్యాలు దాఖలు చేశారు.

Updated Date - Dec 02 , 2025 | 04:26 AM