Health Department: తురకపాలెంలో ఇంటింటి సర్వే
ABN , Publish Date - Sep 07 , 2025 | 04:13 AM
గుంటూరు జిల్లా తురకపాలెంలో ప్రబలిన విష జ్వరాలకు కారణాలు అన్వేషించడంలో వైద్య బృందాలు తలమునకలయ్యాయి. హెల్త్ ఎమర్జెన్సీలో భాగంగా మూడు రోజుల్లో గ్రామస్థులందరి ఆరోగ్య అంశాలకు సంబంధించిన...
రంగంలోకి ఎయిమ్స్ వైద్యులు
గుంటూరు మెడికల్, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా తురకపాలెంలో ప్రబలిన విష జ్వరాలకు కారణాలు అన్వేషించడంలో వైద్య బృందాలు తలమునకలయ్యాయి. హెల్త్ ఎమర్జెన్సీలో భాగంగా మూడు రోజుల్లో గ్రామస్థులందరి ఆరోగ్య అంశాలకు సంబంధించిన ప్రొఫైల్ సిద్ధం చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో.. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఇంటింటి సర్వే చేపట్టింది. ప్రతి ఒక్కరి నుంచి రక్త నమూనాలు సేకరిస్తున్నారు. జ్వర బాధితుల రక్త నమూనాలను కల్చర్ పరీక్షల కోసం పంపుతున్నారు. గ్రామంలో మెలియోయిడోసిస్ జ్వరాలు ప్రబలినట్లు అనుమానిస్తున్న నేపథ్యంలో.. వీటిని నిగ్గు తేల్చేందుకు మంగళగిరిలోని ఎయిమ్స్ వైద్యులు గ్రామాన్ని సందర్శించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో కలసి గ్రామస్థుల రక్తనమూనాల సేకరణలో, వైద్య చికిత్సల్లో తమవంతు సాయం అందిస్తున్నారు. మరో పక్క సీఎం ఆదేశాల మేరకు గ్రామస్థులకు శనివారం ఉచిత భోజన శిబిరం ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు దీనిని నిర్వహించున్నారు. ఇంటింటికీ మినరల్ వాటర్ పంపిణీ చేశారు. గ్రామంలో కూడా పెద్ద సైజు వాటర్ ట్యాంకర్లు ఏర్పాటు చేశారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు గ్రామంలో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు. తురకపాలెంలో ప్రబలిన జ్వరాలపై పలు ప్రజాసంఘాలు, వైద్య సంఘాలు, సేవా సంస్థల ప్రతినిధులు నిజ నిర్ధారణ కమిటీగా ఏర్పడి స్ధానికంగా పర్యటించారు. మృతుల కుటుంబ సభ్యులను కలిసి వాస్తవ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.