Minister Satya Kumar: వైద్యుల్లో జవాబుదారీతనం పెరగాలి
ABN , Publish Date - Dec 10 , 2025 | 05:42 AM
ప్రజారోగ్య రంగంలో ఏడాదిన్నరలోనే కొంత మార్పు తీసుకురాగలిగామని, కానీ.. చేయాల్సింది ఇంకా ఉందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు.
ప్రజలకు నాణ్యమైన సేవలందించాలి
విభాగాధిపతులే దీనికి బాధ్యత వహించాలి
ఆరోగ్యశాఖపై సమీక్షలో మంత్రి సత్యకుమార్
అమరావతి, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రజారోగ్య రంగంలో ఏడాదిన్నరలోనే కొంత మార్పు తీసుకురాగలిగామని, కానీ.. చేయాల్సింది ఇంకా ఉందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో ఆరోగ్యశాఖ విభాగాధిపతులతో మంగళవారం ఆయన 3 గంటల పాటు సమీక్ష నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తయిన సందర్భంగా ఆరోగ్యశాఖ పనితీరు, ఫలితాలను సమీక్షించారు. వైద్యులు, ఇతర సిబ్బంది బాధ్యతతో, జవాబుదారీతనంతో ప్రజలకు నాణ్యమైన సేవలందించాలని కోరారు. దీనికి విభాగాధిపతులే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ఇటీవల కొందరు ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్య ధోరణిపై వచ్చిన వార్తల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆపరేషన్లు చేసి బ్లేడ్లు దేహాల్లోనే వదిలేయడం, రోగులకు సరిపడని ఇంజక్షన్లు ఇవ్వడం, గంటల తరబడి వారిని పట్టించుకోకపోవడం, రోగుల పట్ల దురుసుగా ప్రవర్తించడం వంటి ధోరణిని ఏమాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇలాంటి నిర్లక్ష్య ధోరణితో ప్రభుత్వాస్పత్రులపై ప్రజల విశ్వాసం సన్నగిల్లుతుందని, ఇవి పునరావృతం కాకూడదని హెచ్చరించారు. డీఎంహెచ్‌వోలు, డీసీహెచ్‌ఎ్‌సల పనితీరును మంత్రి ఆక్షేపించారు. తమ బాధ్యతల పట్ల అవగాహన లేనట్లు వ్యవహరిస్తున్నారని, దీనికి అడ్డుకట్ట వేయాలని డీహెచ్‌ను ఆదేశించారు. జీజీహెచ్‌ల సూపరింటెండెంట్లు, అడ్మినిస్ట్రేటర్ల మధ్య సమన్వయ లోపం ఉండకూడదన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న స్క్రబ్ టైఫస్ కేసుల గురించీ మంత్రి ఆరా తీశారు. స్క్రబ్ టైఫ్ నివారణ, చికిత్స పద్ధతులపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.
11 డ్రగ్ భవనాలు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రూ.11.12 కోట్లతో కొత్తగా నిర్మించిన 11 ఔషధ పరిపాలనా భవనాలు, టెస్టింగ్ ల్యాబ్‌లను మంత్రి సత్యకుమార్ మంగళవారం ప్రారంభించారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనం నుంచి ఆయన వర్చువల్‌గా పాల్గొనగా... స్థానిక ఎమ్మెల్యేల ఆయా భవనాల వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో వీటి నిర్మాణాలు పూర్తి చేసినట్లు చెప్పారు. కొత్తగా ప్రారంభించిన ల్యాబ్‌ల్లో రూ.6 కోట్ల వ్యయంతో అత్యాధునిక పరికరాలు సమకూర్చనున్నామని చెప్పారు. ఔషధ నియంత్రణ పరిపాలనా శాఖలో ఖాళీగా ఉన్న ఎనలిస్టులు, ఇతర పోస్టులను మెడికల్ సర్వీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా చేపట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 152 మందుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేపడితే 148 షాపుల్లో ఏదో ఒక లోపం కనిపించిందని వెల్లడించారు. కొందరు విధి నిర్వహణలో ప్రలోభాలకు లోనవుతున్నారని తెలిసిందని, అవినీతికి పాల్పడే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
పాడేరుకు 100 ఎంబీబీఎస్ సీట్లు..
పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాలలో వచ్చే విద్యా సంవత్సరానికి పూర్తిస్థాయిలో 100 ఎంబీబీఎస్ సీట్ల ప్రవేశాలకు జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) ముందస్తుగానే అనుమతించిందని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. సంబంధిత అధికారుల్లో సమన్వయ లోపం కారణంగా ప్రస్తుత విద్యా సంవత్సరానికి 50 సీట్లు కోల్పోయామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాతో చర్చించామని, వచ్చే ఏడాది మరో 50 ఎంబీబీఎస్ సీట్లకు అనుమతులు కూడా ఈ ఏడాదే ఇచ్చారని చెప్పారు. పిడుగురాళ్లలో కేంద్ర ప్రాయోజిత పథకం కింద చేపట్టిన వైద్య కళాశాలలో 2026-27లో ఎంబీబీఎస్ ప్రవేశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని డీఎంఈని ఆదేశించారు. ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో చేపడుతున్న ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పులివెందుల వైద్య కళాశాలల్లో 2026-27లో ఎంబీబీఎస్ ప్రవేశాలకు చర్యలు చేపట్టాలని కోరారు. సమీక్షలో కమిషనర్ వీరపాండియన్, ఎండీ గిరీషా, డీఎస్‌హెచ్ చక్రధర్‌బాబు, వైద్య సేవ ట్రస్ట్ సీఈవో దినేష్ కుమార్, ఏపీ శాక్స్ ఎండీ నీలకంఠారెడ్డి, డీఎం డా.రఘునందన్, డీహెచ్ పద్మావతి పాల్గొన్నారు.