Minister Satya Kumar: పార్వతీపురం వైద్య కళాశాలకు భూ సేకరణే చేయలేదు
ABN , Publish Date - Oct 11 , 2025 | 05:08 AM
వైద్య కళాశాలలకు సంబంధించి మాజీ సీఎం జగన్ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి విఫలయత్నం చేశారని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు.
పట్టపగలు అబద్ధాలు చెప్పడం జగన్‌కే సాధ్యం
ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
అమరావతి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): వైద్య కళాశాలలకు సంబంధించి మాజీ సీఎం జగన్ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి విఫలయత్నం చేశారని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. పార్వతీపురం మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నట్లు, అందుకు సంబంధించిన ఫొటోలను పరిశీలిస్తే వెల్లడవుతుందని జగన్ వ్యాఖ్యానించడాన్ని ఖండించారు. అధికారం నుంచి వైదొలగే వరకూ పార్వతీపురం కాలేజీకి జగన్ భూసేకరణ కూడా చేయలేదని ధ్వజమెత్తారు. బహిరంగంగా అబద్ధాలు చెప్పడం జగన్‌కే సాధ్యమని ఎద్దేవా చేశారు. ఇందులో వాస్తవాలను వెలుగులోకి తేవడానికి తనకు ఇష్టమైన వారితో మాజీ సీఎం నిజనిర్ధారణ కమిటీ వేయాలని సవాల్ విసిరారు. అక్కడ భూసేకరణ పూర్తయి, నిర్మాణ పనులు జరుగుతున్నాయని ఆ కమిటీ నిర్ధారిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, లేకుంటే జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆయుష్‌కు రూ.210 కోట్లు
రాష్ట్రంలో ఆయుష్ వైద్యసేవల విస్తరణ, మెరుగు కోసం రూ.166 కోట్లు మంజూరుకు కేంద్రం ఆమోదించిందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. విజయవాడ హెల్త్ వర్సిటీలో శుక్రవారం ఆయుష్ వైద్య విద్యార్థులు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ధర్మవరం, కాకినాడల్లో కొత్తగా ఆయుర్వేద వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో రూ.210 కోట్లతో కొత్తగా రెండు ఆయుర్వేద, ఒక యునాని వైద్య కళాశాల రానుందని పేర్కొన్నారు. శ్రీకాకుళం, ప్రకాశం, అల్లూరి, ఎన్టీఆర్, గుంటూరు, తిరుపతి జిల్లాల్లో 50 పడకల ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆస్పత్రుల ఏర్పాటుకు కేంద్రం రూ.52.35 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఆయుర్వేద ఆరోగ్య మందిరాల అభివృద్ధికి కూడా నిధులు కేటాయించిందని తెలిపారు. రెండేళ్ల వ్యవధిలో రూ.248.89 కోట్లు మంజూరు కావడం రాష్ట్ర ఆయుష్ శాఖ చరిత్రలో ఇదే తొలిసారి అని మంత్రి తెలిపారు.