Minister Satya kumar: నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి
ABN , Publish Date - Oct 09 , 2025 | 06:07 AM
ప్రభుత్వంలో ఉన్నప్పుడు నర్సీపట్నంలో నిర్మించ తలపెట్టిన మెడికల్ కాలేజీ పనులపై నాడు కనీసం సమీక్షించకుండా, పనులు వేగవంతం చేయాలని ఆదేశించిన మాజీ సీఎం జగన్..
జగన్‌కు మంత్రి సత్యకుమార్ సవాల్
అమరావతి, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వంలో ఉన్నప్పుడు నర్సీపట్నంలో నిర్మించ తలపెట్టిన మెడికల్ కాలేజీ పనులపై నాడు కనీసం సమీక్షించకుండా, పనులు వేగవంతం చేయాలని ఆదేశించిన మాజీ సీఎం జగన్.. ఇప్పుడు ఆ ప్రాంతంలో పర్యటించడాన్ని తాము స్వాగతిస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. 16 నెలల తర్వాత చేపట్టిన ఈ పర్యటన ద్వారా వాస్తవాల్ని తెలుసుకుని ఆయనలో కనువిప్పు కలిగితే ఎంతగానో సంతోషిస్తానని వెల్లడించారు. ఈ సందర్భంగా జగన్‌కు తానడిగే పది ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. ‘పులివెందుల మెడికల్ కాలేజీ పట్ల శ్రద్ధ కనబరిచి నర్సీపట్నం, పార్వతీపురం కాలేజీల నిర్మాణాలను ఎందుకు నిర్లక్ష్యం చేశారు? నర్సీపట్నం కాలేజీలో 2025-26లో 150 ఎంబీబీఎస్ ప్రవేశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారా? లేదా? ఆ మేరకు గెజిట్ నోటిపికేషన్ ఇచ్చి, అధికారం నుంచి వైదొలగే నాటికి కేవలం రూ.10.70 కోట్లు మాత్రమే వెచ్చించడం ఎంతవరకు సబబు? మీ అసమర్థతను కప్పిపుచ్చుకుంటూ కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు సబబా? మీ నిర్వాకంతో కుదేలైన నర్సీపట్నం వైద్య కళాశాల నిర్మాణానికి కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా బాధ్యుల్ని చేస్తారు? తదితర ప్రశ్నలకు బహిరంగంగా స్పందించి, నర్సీపట్నం వైద్య కళాశాల, ఇతర కళాశాలల నిర్మాణం విషయంలో చర్చకు అంగీకరించాలని మాజీ సీఎం జగన్ రెడ్డికి మంత్రి సత్యకుమార్ సవాల్ విసిరారు.