Share News

Chevireddy Bhaskar Reddy: బెయిల్‌ కోసం ఎత్తులు

ABN , Publish Date - Sep 27 , 2025 | 04:16 AM

లిక్కర్‌ స్కామ్‌లో నిందితుడిగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి రెగ్యులర్‌ బెయిల్‌ రిజెక్ట్‌ అయింది. పీఎస్ఆర్‌కు బెయిల్‌ వచ్చిన తర్వాత తనకు వెన్నునొప్పి ఉందంటూ ఫిజియోథెరపీ కోసం బెయిల్‌ మంజూరు చేయాలని...

Chevireddy Bhaskar Reddy: బెయిల్‌ కోసం ఎత్తులు

  • లిక్కర్‌ నిందితులు.. రోజుకో అనారోగ్య కారణం!

  • వెన్నునొప్పి కథ చెప్పి విఫలమైన చెవిరెడ్డి

  • యూరాలజీ సమస్య ఉందని చెప్పి..

  • ఆర్థోపెడిక్‌ పరీక్షలు చేయించుకున్న కసిరెడ్డి

  • ఎముక క్యాన్సర్‌ కారకాలు ఉండొచ్చని ‘నివేదిక’

  • నిగ్గు తేల్చేందుకు కమిటీ.. 29న పరీక్షలు

  • నిందితులు చెబుతున్న కారణాలపై సిట్‌ అధికారుల సందేహాలు

  • పీఎ్‌సఆర్‌కు బెయిల్‌ వచ్చాక ఎత్తుగడ

ఏపీపీఎస్సీలో అక్రమాల కేసుతో పాటు ముంబై నటిని వేధించిన కేసులో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు అనారోగ్య కారణాలతో బెయిల్‌ పొందిన తర్వాత.. లిక్కర్‌ స్కామ్‌ నిందితులూ ఏవేవో అనారోగ్య సమస్యలు చెబుతున్నారు. నిందితులు చెబుతున్న కారణాలు, తీరుపై సిట్‌ అధికారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. బెయిల్‌ పొందేందుకే అనారోగ్యం పేరిట ఎత్తులు వేస్తున్నారని అనుమానిస్తున్నారు.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

లిక్కర్‌ స్కామ్‌లో నిందితుడిగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి రెగ్యులర్‌ బెయిల్‌ రిజెక్ట్‌ అయింది. పీఎస్ఆర్‌కు బెయిల్‌ వచ్చిన తర్వాత తనకు వెన్నునొప్పి ఉందంటూ ఫిజియోథెరపీ కోసం బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఆయన కోర్టులో పిటిషన్‌ వేశారు. అందుకోసం బెయిల్‌ అవసరం లేదని, జైలులో ఉంటూనే ఫిజియోథెరపీ చేయించుకోవచ్చని కోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది. విజయవాడ జైలులో ఉన్న తనను తిరుపతి లేదా నెల్లూరు జైలుకు తరలిస్తే అక్కడ ఫిజియోథెరపీ చేయించుకుంటానన్న వాదనతోనూ కోర్టు విభేదించింది. చెవిరెడ్డి చెబుతున్న అనారోగ్య కారణాల్లో నిజం లేదన్న పోలీసుల తరఫు న్యాయవాది వాదనతో న్యాయాధికారి ఏకీభవించారు. ఇక వరుసగా రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్లు కోర్టులో రిజెక్ట్‌ అవుతుండటంతో మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియగా భావిస్తున్న ఏ1 రాజ్‌ కసిరెడ్డి కూడా అనారోగ్య కారణాలతో బెయిల్‌ కోరారు. ఏప్రిల్‌ నుంచి విజయవాడ జైలులో ఉంటున్న రాజ్‌ కసిరెడ్డికి మూత్రనాళంలో ఇన్‌ఫెక్షన్‌ వచ్చింది. జైలు మెడికల్‌ ఆఫీసర్‌ ఆయన్ను పరీక్షించి మందులు ఇవ్వడంతో నయమైంది. ఇటీవల మరోసారి తనకు మూత్రంలో రక్తం వస్తోందని, తాను బయట వైద్య పరీక్షలు చేయించుకుంటానని కసిరెడ్డి కోరారు.


జైలు అధికారులు ఈ నెల 6న ఆయన్ను విజయవాడ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. జైలు మెడికల్‌ ఆఫీసర్‌ సిఫారసు చేసిన యూరాలజీ విభాగానికి తీసుకెళ్లగా.. తనకు కాలు నొప్పిగా ఉందంటూ కసిరెడ్డి ఆర్థోపెడిక్‌ విభాగానికి వెళ్లి ఎంఆర్‌ఐ పరీక్షలు చేయించుకున్నాడు. వరుణ్‌ అనే డాక్టర్‌ ఇచ్చిన మెడికల్‌ రిపోర్టులో రాజ్‌ కసిరెడ్డి ఎడమ తొడ ఎముకలో క్యాన్సర్‌ కారక కణాలు ఉండొచ్చని సందేహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ‘ఎంచాండ్రోమా-హెచ్‌పీఈ’ పరీక్ష అవసరమని సూచించినట్టు సమాచారం. దీనిపై దర్యాప్తు అధికారులు ఆరా తీశారు. తమకు అందిన సమాచారాన్ని ప్రభుత్వ న్యాయవాదుల దృష్టికి తీసుకెళ్లారు. జైలు మెడికల్‌ ఆఫీసర్‌తో ఒక సమస్య చెప్పి, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాక మరో పరీక్ష చేయించుకోవడంపై సందేహాలు వ్యక్తం చేశారు. మద్యం కుంభకోణంలో కసిరెడ్డి కీలక నిందితుడు. పథక రచన నుంచి అమలు, వసూళ్లు, ముడుపుల సొమ్ము పంపిణీ, ఆ సొమ్ముతో స్థిరాస్తుల కొనుగోలు, హవాలా, ఇతర దేశాల్లో పెట్టబడుల వరకూ అన్నింట్లోనూ రాజ్‌ కసిరెడ్డి పాత్రపై సిట్‌ ఆధారాలు సేకరించింది. కేసు దర్యాప్తులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తుండటంతో ఇప్పట్లో కేసు చివరి దశకొచ్చే అవకాశాలు కనిపించడం లేదు. పరిస్థితిని అంచనా వేసిన రాజ్‌ కసిరెడ్డి మూత్రనాళం సమస్యను ఎడమ తొడ ఎముకలోకి మార్చి బెయిల్‌ కోసం ఎత్తుగడ వేసినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ ఏసీబీ కోర్టు మెడికల్‌ బృందాన్ని ఏర్పాటు చేసి నిగ్గు తేల్చాలని విజయవాడ జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌కు ఆదేశాలిచ్చింది. దీంతో అసలు విషయం ఏంటన్నది త్వరలో తేలనుంది. కోర్టు ఆదేశాల మేరకు ఆర్థోపెడిక్స్‌, పాథాలజీ, రెడియాలజీ, నెఫ్రాలజీ, రేడియేషన్‌ ఆంకాలజీ, సర్జికల్‌ ఆంకాలజీ వైద్యులతో మెడికల్‌ బోర్డు ఏర్పాటు చేశారు. ఈ నెల 29న ఉదయం 9 గంటల నుంచి రాజ్‌ కసిరెడ్డికి అన్ని పరీక్షలు జరిపి పది రోజుల్లో కోర్టుకు సమగ్ర నివేదిక సీల్డ్‌ కవర్‌లో అందజేస్తారు. నిందితుడికి నిజంగానే ఆరోగ్య సమస్యలు ఉన్నా యా? లేదా పోలీసులు అనుమానిస్తున్నట్లు ఎడమతొడలో ఎముక నొప్పి కట్టుకథేనా? అన్నది తేలనుంది.


పీఎస్ఆర్‌కు బెయిల్‌ వచ్చాక..

ఏపీపీఎస్సీ, ముంబై నటి వేధింపుల కేసులో పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు విజయవాడ జైలులో రిమాండ్‌ ఖైదీగా కొన్నాళ్లు ఉన్నారు. అనారోగ్య కారణాలతో తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. జైలు నుంచి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించగా, ఆయనకు నిజంగానే ఆరోగ్య పరమైన సమస్యలు ఉన్నట్లు తేలింది. దీంతో విజయవాడ ఏసీబీ కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఆ తర్వాత లిక్కర్‌ స్కామ్‌ నిందితులు కూడా బెయిల్‌ కోసం అనారోగ్యం పేరిట ఎత్తులు వేస్తున్నారని దర్యాప్తు అధికారులు సందేహిస్తున్నారు.


స్కామ్‌లో కీలక నిందితులు

గత ప్రభుత్వంలో జరిగిన 3,500 కోట్ల లిక్కర్‌ స్కామ్‌లో కీలక వ్యక్తులు నిందితులుగా ఉన్నారు. వారిలో అప్పటిముఖ్యమంత్రి జగన్‌కు ఐటీ సలహాదారుగా వ్యవహరించిన కసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డిది మొదటి స్థానం. గత ప్రభుత్వంలో ముఖ్యులైన మిథున్‌ రెడ్డి, విజయ సాయిరెడ్డి, ధనుంజయ్‌ రెడ్డి, కృష్ణమోహన్‌ రెడ్డి, వాసుదేవ రెడ్డి, సత్యప్రసాద్‌, సజ్జల శ్రీధర్‌ రెడ్డితో కలిసి మద్యం దోపిడీకి పథక రచన చేశాడు. మద్యం షాపులకు జే బ్రాండ్లు సరఫరా చేసిన మద్యం సరఫరాదారుల నుంచి ముడుపులు వసూలు చేసేందుకు బూనేటి చాణక్య, తుకేకుల కిరణ్‌కుమార్‌ రెడ్డి తదితరులతో మరో గ్యాంగ్‌ ఏర్పాటు చేసుకున్నాడు. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఇప్పటి వరకూ 19 సంస్థలు, 29 మంది వ్యక్తులను నిందితులుగా చేర్చింది. పన్నెండు మందిని అరెస్టు చేసి జైలుకు పంపింది. వారిలో ఏ-1 రాజ్‌ కసిరెడ్డితో పాటు వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి సహా ఎనిమిది మంది ఇప్పటికీ విజయవాడ, రాజమహేంద్రవరం జైళ్లలో ఉన్నారు. నలుగురు బెయిల్‌పై విడుదలయ్యారు.

Updated Date - Sep 27 , 2025 | 04:20 AM