Share News

Health Emergency Declared in Turkapalem: తురకపాలెంలో హెల్త్‌ ఎమర్జెన్సీ

ABN , Publish Date - Sep 06 , 2025 | 04:19 AM

గుంటూరు రూరల్‌ మండలం తురకపాలెంలో ప్రబలిన అంతుచిక్కని జ్వరాల నేపథ్యంలో గ్రామంలో హెల్త్‌ ఎమర్జెన్సీగా భావించి విధులు ...

Health Emergency Declared in Turkapalem: తురకపాలెంలో హెల్త్‌ ఎమర్జెన్సీ

  • ఎయిమ్స్‌ వైద్య నిపుణుల సాయం తీసుకోండి

  • కొత్త కేసులు నమోదుకాకుండా చర్యలు

  • తీవ్రత ఎక్కువ ఉన్నవారిని ఆస్పత్రుల్లో చేర్చాలి

  • నేడు, రేపు ప్రత్యేక వైద్య బృందాలతో పరీక్షలు

  • సోమవారానికి అందరి హెల్త్‌ ప్రొఫైల్‌

  • ఆరోగ్య శాఖకు సీఎం చంద్రబాబు ఆదేశం

  • తురకపాలెం మరణాలపై అత్యవసర సమీక్ష

  • ఉన్నత స్థాయి విచారణకు కమిటీ: మంత్రి సత్య

  • కలుషిత నీరు కారణం కాదన్న పెమ్మసాని

గుంటూరు మెడికల్‌, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): గుంటూరు రూరల్‌ మండలం తురకపాలెంలో ప్రబలిన అంతుచిక్కని జ్వరాల నేపథ్యంలో గ్రామంలో హెల్త్‌ ఎమర్జెన్సీగా భావించి విధులు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్య శాఖను ఆదేశించారు. రెండు నెలలుగా గుంటూరు జిల్లా తురకపాలెంలో అంతుచిక్కని వ్యాధితో సంభవిస్తున్న వరుస మరణాలపైనా, గ్రామంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపైనా శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో వైద్యారోగ్య శాఖాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. జూలై, ఆగస్టు నెలల్లో ఈ గ్రామం నుంచి ఎక్కువ మంది చనిపోవడానికి గల కారణాలపై మొదట దృష్టి పెట్టాలని, అన్ని కోణాల్లోనూ పరిశీలించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. శని, ఆదివారాలు ప్రత్యేక వైద్య బృందాలతో తురకపాలెంలో అందరికీ నిర్దేశిత 42 వైద్య పరీక్షలు నిర్వహించి సోమవారం నాటికి అందరి హెల్త్‌ ప్రొఫైల్‌ రూపొందించాలని ఆదేశించారు. అనారోగ్య తీవ్రత ఎక్కువగా ఉన్నవారిని ఆస్పత్రుల్లో చేర్పించి అత్యవసర చికిత్స అందించాలని ఆదేశించారు.

కేంద్ర వైద్య బృందాల సాయం తీసుకోవాలి

ఎయిమ్స్‌ సహా కేంద్ర వైద్య బృందాలను రప్పించాలని, అవసరమైతే అంతర్జాతీయ వైద్యుల సాయం తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. గాలి, నీరు, ఆహారం, భూమి ద్వారా బ్యాక్టీరియా వ్యాపించే అవకాశం ఉందని, తురకపాలెంలో అందరికీ సురక్షిత తాగునీరు అందించాలని తెలిపారు. పరిశుభ్రమైన వాతావరణం, ఆహారంపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతీ రోగీని వైద్య పర్యవేక్షణలో ఉంచాలని, కొత్త కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా, తురకపాలెంలో ప్రస్తుతం ఉన్న కేసులను పరిశీలిస్తే ‘మెలియోయిడోసిస్‌’ లక్షణాలు ఉన్నట్టు వైద్యాధికారులు అనుమానం వ్యక్తం చేశారు. బ్లడ్‌ శాంపిల్స్‌ ల్యాబ్‌లకు పంపామని, 72 గంటల్లో రిపోర్టులు వస్తాయని ముఖ్యమంత్రికి తెలిపారు.


2.jpg1.jpg

కలుషిత నీరు కారణం కాదు: కేంద్ర మంత్రి పెమ్మసాని

తురకపాలెం మరణాలకు కలుషిత నీరు కారణం కాదని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. గ్రామంలో బాధిత కుటుంబాలను శుక్రవారం ఆయన పరామర్శించి ధైర్యం చెప్పారు. కాగా, గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో మరణించిన ఏడుగురు రోగుల కేస్‌ షీట్లను వైద్య నిపుణులతో పరిశీలన చేయించాలని డీఎంఈ డాక్టర్‌ రఘునందన్‌ను వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఆదేశించారు.

మెలియోయిడోసి్‌సగా అనుమానం...

మెలియోయిడోసిస్‌ ప్రధానంగా భూమి, నిల్వ నీరు, తడి నేలలో ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో, వరదల సమయంలో వ్యాప్తి చెందుతుంది. డయాబెటిస్‌, కిడ్నీ, లివర్‌ సమస్యలు ఉన్నవారు... వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు... రైతులు, నీటిలో ఎక్కువగా పనిచేసేవారు ఈ వ్యాధికి గురయ్యే అవకాశం ఉంటుందని వైద్యులు చెప్పారు.

ఉన్నత స్థాయి విచారణ కమిటీ ఏర్పాటు: మంత్రి సత్యకుమార్‌

తురకపాలెంలో వరుస మరణాల విషయంలో వైద్యపరమైన పర్యవేణక్షణ లోపం ఏమైనా ఉందా..? ఉంటే బాధ్యులెవరు..? అని నిర్ధారించేందుకు డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ డాక్టర్‌ అట్టాడ సిరి నేతృత్వంలో ఉన్నతస్థాయి విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్టు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. శుక్రవారం ఆయన తురకపాలెంలో పర్యటించారు. మెలియోయిడోసిస్‌ జ్వరాల వల్ల మరణాలు జరిగినట్లు వార్తలొచ్చాయని, ఇప్పటివరకు రక్తనమూనాల పరీక్షల ఫలితాల్లో ఇంకా ఆ విషయం నిర్ధారణ కాలేదని అన్నారు.

Updated Date - Sep 06 , 2025 | 04:19 AM