Share News

చాక్లెట్‌ ఇచ్చారని.. చెప్పుతో కొట్టిన లెక్చరర్‌

ABN , Publish Date - Jul 12 , 2025 | 11:24 PM

ద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువులే సహనం కోల్పోతున్నారు. వారు ఏమి చేస్తున్నారో వారికే తెలియకుండా ప్రవర్తిస్తున్నారు.

 చాక్లెట్‌ ఇచ్చారని..   చెప్పుతో కొట్టిన లెక్చరర్‌

విద్యార్థి సంఘాల జోక్యంతో సద్దుమణిగిన సమస్య

ఆత్మకూరు, జూలై 12(ఆంధ్రజ్యోతి): విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువులే సహనం కోల్పోతున్నారు. వారు ఏమి చేస్తున్నారో వారికే తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. తప్పు చేసిన విద్యార్థులను మందలించాల్సిందిపోయి చెప్పుతో కొట్టిన ఘటన ఆత్మకూరు పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. వారం రోజుల క్రితం ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్న ఓ విద్యార్థి అదే తరగతికి చెందిన ఓ విద్యార్థినీకి చాక్లెట్‌ను మరో విద్యార్థితో ఇప్పించాడు. విద్యార్థినీ తరగతిలో ఉన్న అధ్యాపకురాలికి విషయం చెప్పింది. చాక్లెట్‌ ఇచ్చిన విద్యార్థిని తిడుతూ.. ఇవ్వమని చెప్పిన విద్యార్థిని లెక్చరర్‌ చెప్పుతో కొట్టింది. దీంతో ఆ విద్యార్థి ఇంట్లో వాళ్లకు విషయం చెప్పాడు. వారు కళాశాల ప్రిన్సిపాల్‌ వద్దకు సమస్యను తీసుకెళ్లారు. పిల్లలను చెప్పులతో కొట్టడమేమిటని, అవమానం భరించలేక ఏమైనా అఘాయిత్యం చేసుకుంటే బాధ్యులు ఎవరని నిలదీశారు. సమస్య విద్యార్థి సంఘాల నాయకులకు చేరింది. వారి సమక్షంలోనే సదరు అధ్యాపకురాలితో రాజీ కుదుర్చుకుని సమస్యను సద్దుమణిగించినట్లు తెలిసింది. ఈవిషయంపై ఇంటర్‌ బోర్డు అధికారులు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

మందలించి సంజాయిషీ..

తమ కళాశాలలో పని చేస్తున్న ఓ కాంట్రాక్ట్‌ లెక్చరర్‌ విద్యార్థిని చెప్పుతో కొట్టిన మాట వాస్తవమే. ఆమెను మందలించడంతో పాటు ఇలాంటి తప్పు మరొసారి చేయబోనని లిఖితపూర్వకంగా సంజాయిషీ రాయించుకున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే విధుల నుంచి తొలగించేందుకు డీవీఈవోకు సిఫారసు చేస్తాం.

- సుంకన్న, ప్రిన్సిపాల్‌, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ఆత్మకూరు

Updated Date - Jul 12 , 2025 | 11:24 PM