Share News

ముక్కలుగా నరికేశాడు..

ABN , Publish Date - Oct 05 , 2025 | 01:13 AM

వృద్ధురాలి దారుణ హత్య ఆలస్యంగా వెలుగుచూసింది. పిన్ని వరస అయ్యే వృద్ధురాలిని ఓ వ్యక్తి ముక్కలు ముక్కలుగా నరికేశాడు. తల, కాళ్లు, చేతులు, మొండెం భాగాలను గోనె సంచిలో కట్టి తీసుకెళ్లి వేర్వేరు ప్రాంతాల్లోని మురుగు కాల్వలో పడేశాడు. నగరంలో సంచలనం రేపిన ఈ ఘటనకు సంబంధించి విశ్వసనీయ సమాచారం మేరకు..

ముక్కలుగా నరికేశాడు..

-ఊర్మిళానగర్‌లో వృద్ధురాలి దారుణ హత్య!

-తల, కాళ్లు, చేతులు, మొండెం వేరు చేసి..

-మురుగు కాల్వల్లో విసిరేశాడు

- అక్క కుమారుడి ఘాతుకం

- తనకు, తన భార్యకు మధ్య గొడవకు ఆమె కారణమని పగ

- హత్యలో మైనర్‌ అయిన కుమారుడి సహకారం

- పోలీసుల అదుపులో నిందితులు!

విద్యాధరపురం, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): వృద్ధురాలి దారుణ హత్య ఆలస్యంగా వెలుగుచూసింది. పిన్ని వరస అయ్యే వృద్ధురాలిని ఓ వ్యక్తి ముక్కలు ముక్కలుగా నరికేశాడు. తల, కాళ్లు, చేతులు, మొండెం భాగాలను గోనె సంచిలో కట్టి తీసుకెళ్లి వేర్వేరు ప్రాంతాల్లోని మురుగు కాల్వలో పడేశాడు. నగరంలో సంచలనం రేపిన ఈ ఘటనకు సంబంధించి విశ్వసనీయ సమాచారం మేరకు.. భవానీపురం ఏరియా ఊర్మిళానగర్‌లో ఓ వృద్ధురాలు ఒంటరిగా నివాసం ఉంటుంది. ఆమె నివాసానికి సమీపంలో తన అక్క కుమారుడు కుటుంబ సభ్యులతో ఉంటున్నాడు. గత కొన్ని రోజులుగా అతనికి, అతని భార్యకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భార్య ఇంటి నుంచి వెళ్లిపోయి పుట్టింట్లో ఉంటున్నట్లు సమాచారం. తన భార్య వెళ్లిపోవడానికి కారణం తన పిన్ని అని ఆమెపై పగా పెంచుకున్నాడు. ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు. విజయదశమికి ముందురోజు బుధవారం వృద్ధురాలి వద్దకు వెళ్లి ఆమెకు మాయమాటలు చెప్పి నమ్మకంగా బైక్‌పై తన ఇంటికి తీసుకువచ్చాడు. అప్పటికే సిద్ధం చేసుకున్న పదునైన ఆయుధాలతో ఆమెపై మైనర్‌ అయిన కొడుకుతో కలిసి దాడి చేసి చంపేసినట్టు సమాచారం. తల, కాళ్లు చేతులు నరికేశాడు. అనంతరం రెండు గోనె సంచుల్లో మృతదేహం భాగాలను మూటకట్టి ఊరి చివరిలోని వేర్వేరు మురుగు కాల్వల్లో పడేశాడు. ఆ తర్వాత నంద్యాలకు పరారయ్యారు.

వృద్ధురాలి అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు

వృద్ధురాలు కనిపించడం లేదని ఆమె సమీప బంధువు మూడు రోజుల క్రితం భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో బొమ్మసాని నగర్‌ డ్రైనేజీలో ఒక మహిళకు చెందిన మొండెం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న భవానీపురం సీఐ ఉమామహేశ్వరరావు తన బృందంతో మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. అదృశ్యమైన వృద్ధురాలు ఈమెనని గుర్తించారు. వృద్ధురాలు నివాసం ఉండే ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. నిందితులు నంద్యాలలో ఉన్నట్లు తెలుసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు తీసుకువచ్చి వెస్ట్‌ డివిజన్‌ ఏసీపీ దుర్గారావు, భవానీపురం సీఐ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో రహస్య విచారణ జరుపుతున్నట్టు తెలిసింది. ఏయే ప్రాంతాల్లో హతురాలి శరీర భాగాలు పడవేశారో తెలుసుకునేందుకు నిందితులను వెంటబెట్టుకుని వెళ్లినట్టు సమాచారం. తల, చేతులు అట్కిన్‌సన్‌ స్కూల్‌ రోడ్డులో, మొండెం బొమ్మసాని నగర్‌లో గుర్తించినట్టు తెలిసింది. మృతురాలి కాళ్లు మాత్రం లభించలేదని సమాచారం. నగర పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి.రాజశేఖర్‌బాబు ఆదేశాల మేరకు భవానీపురం పోలీస్‌ అధికారులు ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Updated Date - Oct 05 , 2025 | 01:13 AM