Share News

తండ్రిని కొట్టి చంపేశాడు!

ABN , Publish Date - Aug 12 , 2025 | 12:49 AM

తనతో పాటు పెయింటింగ్‌ పనికి రావడంలేదనే కోపంతో తండ్రిని కొడుకు కొట్టి చంపిన ఘటన తాడిగడప శ్రీనివాసనగర్‌ కట్టపై ఆదివారం జరిగింది.

తండ్రిని కొట్టి చంపేశాడు!

-తనతో పెయింటింగ్‌ పనికి రానన్నాడని గొడవ

-తండ్రిని ఈడ్చుకెళ్లి గేటుకేసి కొట్టిన కొడుకు

-తలకు తీవ్రగాయమై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

-తాడిగడప శ్రీనివాసనగర్‌ కట్టపై ఘటన

-హత్య కేసు నమోదు చేసిన పెనమలూరు పోలీసులు

పెనమలూరు, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): తనతో పాటు పెయింటింగ్‌ పనికి రావడంలేదనే కోపంతో తండ్రిని కొడుకు కొట్టి చంపిన ఘటన తాడిగడప శ్రీనివాసనగర్‌ కట్టపై ఆదివారం జరిగింది. పెనమలూరు పోలీసుల కథనం ప్రకారం... తాడిగడప శ్రీనివాసనగర్‌ కట్టకు చెందిన నన్నం శౌరి(68) పెయింటింగ్‌ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతనికి ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమారుడు కేశవరావు కూడా పెయింటింగ్‌ పనులకు వెళ్తున్నాడు. మద్యానికి అలవాటు పడటంతో భార్య అతనితో గొడవ పెట్టుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి కేశవరావు తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి రోజూ భోజనం చేసి వెళ్తున్నాడు. తండ్రి శౌరి అప్పుడప్పుడు కుమారుడు కేశవరావు వెంట పనులకు వెళ్తుండేవాడు. కూలి డబ్బులు సరిగా ఇవ్వకపోవడంతో పనికి వెళ్లడం మానేశాడు. ఆదివారం సాయంత్రం తన వెంట పెయింటింగ్‌ పనులకు ఎందుకు రావంటూ కేశవరావు తండ్రి శౌరితో గొడవ పెట్టుకున్నాడు. తండ్రిని రోడ్డు మీద పడేసి తలపట్టుకొని ఈడ్చుకుంటా ఇంట్లోకి తీసుకెళుతూ గేటుకేసి గుద్దాడు. ఆ తర్వాత ఇంట్లోకి తీసుకెళ్లి నాపరాయికి వేసి కొట్టాడు. తీవ్రంగా గాయపడిన శౌరిని చూసిన కుమార్తె, చుట్టుపక్కల వారు వెంటనే అక్కడకెళ్లి కేశవరావు నుంచి శౌరిని విడిపించి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం శౌరి మృతి చెందాడు. శౌరి కుమార్తె శశిరేఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెనమలూరు పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.

Updated Date - Aug 12 , 2025 | 12:49 AM