Share News

Sri Sathya Sai District: హవాలా దోపిడీ

ABN , Publish Date - Dec 09 , 2025 | 04:22 AM

ఎక్కడో గుజరాత్‌లోని సూరత్‌ నుంచి బెంగళూరుకు వెళ్తున్న కారు! దానిని వెంటాడుతూ ఐదు వాహనాల్లో ఒక ముఠా! హైవేపే కారును అడ్డగించి...

Sri Sathya Sai District: హవాలా దోపిడీ

  • సత్యసాయి జిల్లాలో సినీఫక్కీలో ఘటన

  • సూరత్‌ నుంచి బెంగళూరుకు రూ.4.30 కోట్ల నగదు

  • ఇన్నోవా వాహనంలో రహస్యంగా తరలింపు

  • అడ్డుకుని, కిడ్నాప్‌ చేసి ఎత్తుకెళ్లిన మరో ముఠా

  • అదే దారిలో కారులో వెళ్తూ దోపిడీని గుర్తించిన ఓ టెకీ

  • రంగంలోకి పోలీసులు.. 2 కార్లూ వదిలేసి వెళ్లిన గ్యాంగ్‌

  • జీపీఎస్‌తో దానిని వెతుక్కుంటూ వచ్చిన ‘బాధితులు’

  • ఒక కారులో రూ.1.20 కోట్ల నగదు స్వాధీనం

పుట్టపర్తి, పెనుకొండ టౌన్‌, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఎక్కడో గుజరాత్‌లోని సూరత్‌ నుంచి బెంగళూరుకు వెళ్తున్న కారు! దానిని వెంటాడుతూ ఐదు వాహనాల్లో ఒక ముఠా! హైవేపే కారును అడ్డగించి... డ్రైవర్లను అదుపులోకి తీసుకుని, కారుతో సహా పరార్‌! ఇది పోలీసుల దృష్టికి రాగానే... ‘చేజ్‌’ మొదలైంది. రెండు కార్లను వదిలేసి ముఠా పారిపోయింది. తీరా చూస్తే... సూరత్‌ నుంచి బెంగళూరుకు వెళ్తున్న కారులో రూ.4.30 కోట్ల హవాలా సొమ్ము! ఇది సినిమా కథ కాదు! సత్యసాయి జిల్లాలో నిజంగానే జరిగింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... సూరత్‌ నుంచి ఎంహెచ్‌ 01 ఈవీ 4927 ఇన్నోవా వాహనంలో బెంగళూరుకు హవాలా సొమ్ము తరలిస్తున్నారు. సుదీర్ఘ ప్రయాణం... పైగా కారులో రూ.4 కోట్ల సొమ్ము. అందులో ఇద్దరు డ్రైవర్లున్నారు. కారు...ఈనెల 3వ తేదీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో సత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలోని కియా కార్ల ఫ్యాక్టరీ దాటి.. హరిపురం వై-జంక్షన్‌ దగ్గరకు చేరుకుంది. గట్టిగా రెండుగంటలు ప్రయాణిస్తే... బెంగళూరులోని గమ్యస్థానానికి హవాలా సొమ్ము చేరేది. అంతలోనే... ఐదు కార్లలో వచ్చిన దోపిడీ దొంగలు ‘హవాలా’ కారును అడ్డుకున్నారు. అందులో ఉన్న ఇద్దరు డ్రైవర్లను కిడ్నాప్‌ చేశారు.


హవాలా కారుతోసహా అక్కడి నుంచి ఉడాయించారు. అదే సమయంలో బెంగుళూరు వైపు కారులో వెళుతున్న ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఈ తతంగాన్ని గమనించారు. తన కారు డ్యాష్‌ కెమెరాలో రికార్డు అయిన కిడ్నాప్‌ దృశ్యాలను పోలీసులకు పంపారు. వెంటనే అప్రమత్తమైన గోరంట్ల సీఐ శేఖర్‌ తమ సిబ్బందితో జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టారు. పెనుకొండ ఆర్టీఓ కార్యాలయం వద్ద రెండు కార్లు ఆగి ఉండటాన్ని గుర్తించి అటుగా వెళ్లారు. పోలీసులను చూడగానే ఆ దుండగులు ‘హవాలా’ కారును అక్కడే వదిలి మరో కారులో బెంగుళూరు వైపు ఉడాయించారు. దొంగలు వదిలేసిన కారును పోలీసులు స్వాధీనం చేసుకుని పెనుకొండ స్టేషన్‌కు తరలించారు. ఆ కారు ఎవరిదో... అందులో ఏముందో అప్పటికి పోలీసులకు తెలియదు.


కారును వెతుక్కుంటూ వచ్చి..

దుండగులు తాము కిడ్నాప్‌ చేసిన ఇద్దరు డ్రైవర్లను గోరంట్ల-పుట్టపర్తి రహదారి పక్కన అటవీ ప్రాంతంలో వదిలేశారు. హవాలా సొమ్ము ఉన్న కారు ఎక్కడుందో తెలుసుకోవడం వాళ్ల ఫస్ట్‌ టాస్క్‌! దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరంలేదు. ఆ కారుకు జీపీఎస్‌ ట్రాకింగ్‌ ఉంది. అది ‘పెనుకొండ పోలీస్ స్టేషన్‌’కు దారి చూపింది. ‘కారు మాదే సార్‌’ అని వాళ్లు రాగానే.. ‘అసలు ఎవరు మీరు? ఎక్కడి నుంచి... ఎక్కడికి వెళ్తున్నారు? మిమ్మల్ని ఎందుకు కిడ్నాప్‌ చేశారు?’’ అంటూ పోలీసులు ఆరా తీశారు. దీంతో... వాళ్లకు అసలు విషయం చెప్పక తప్పలేదు. సూరత్‌ నుంచి బెంగళూరుకు రూ.4.30 కోట్ల హవాలా సొమ్మును తరలిస్తున్నామని... కారు సీట్లు కింద, డిక్కీలో ఏర్పాటు చేసిన అరల్లో వాటిని దాచామని చెప్పారు. పోలీసులు కారును పరిశీలించగా డిక్కీలోని ఓ అరలో రూ. 1.20 కోట్ల నగదు లభించింది. మరో రూ.3.10 కోట్లను దొంగల ముఠా ఎత్తుకెళ్లినట్లు భావిస్తున్నారు. దీనిపై 4 ప్రత్యేక బృందాలతో... అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పెనుకొండ సీఐ రాఘవన్‌ సోమవారం మీడియాకు తెలిపారు. నగదు తరలిస్తున్న వాహనం సూరత్‌కు చెందిన పులకేస్‌, అనిరుధ్‌కు చెందినదని తెలిపారు. వీరు సూరత్‌, బెంగళూరు ప్రాంతాలలో జీరో వ్యాపారం చేస్తుంటారని చెప్పారు. 2022లో జాతీయ రహదారిపై ఇదే తరహాలో హవాలా డబ్బును కేరళకు చెందిన దొంగల ముఠా దోచుకుంది. తాజా సంఘటన వెనుకా అలాంటి ముఠా ఉందేమోనని అనుమానిస్తున్నారు.

Updated Date - Dec 09 , 2025 | 04:23 AM