Share News

Kuppam: కుప్పంలో దొంగల ముఠా హల్‌చల్‌

ABN , Publish Date - Jun 05 , 2025 | 05:43 AM

హరియాణకు చెందిన అంతర్రాష్ట్రీయ దోపిడీ దొంగల ముఠా కుప్పం వైపు వస్తున్నట్లు జిల్లా ఇంటెలిజెన్స్‌ వర్గాల ద్వారా స్థానిక పోలీసులకు మంగళవారం రాత్రి సమాచారం అందింది.

Kuppam: కుప్పంలో దొంగల ముఠా హల్‌చల్‌

స్కార్పియోతో ఎస్‌ఐని తొక్కించేందుకు యత్నం

కాల్పులు జరిపిన సీఐ.. డ్రైవర్‌కు గాయాలు

కుప్పం, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా కుప్పంలో మంగళవారం రాత్రి హరియాణకు చెందిన దోపిడీ దొంగల ముఠా హల్‌చల్‌ చేసింది. హరియాణకు చెందిన అంతర్రాష్ట్రీయ దోపిడీ దొంగల ముఠా కుప్పం వైపు వస్తున్నట్లు జిల్లా ఇంటెలిజెన్స్‌ వర్గాల ద్వారా స్థానిక పోలీసులకు మంగళవారం రాత్రి సమాచారం అందింది. దీంతో కుప్పం రూరల్‌ సీఐ మల్లేశ్‌ యాదవ్‌, గుడుపల్లె ఎస్‌ఐ శ్రీనివాసులు తమ సిబ్బందితో కలిసి వారిని అడ్డుకునేందుకు బయల్దేరారు. కుప్పం పట్టణంవైపు వేగంగా వస్తున్న ఒక స్కార్పియో వాహనం స్థానిక వ్యవసాయ మార్కెట్టు యార్డు వద్ద పోలీసులకు కనిపించింది. ఆ వాహనంలోనే దొంగల గ్యాంగ్‌ ఉందని నిర్ధారించుకున్న ఎస్‌ఐ శ్రీనివాసులు ఆపడానికి ప్రయత్నించారు. అందులోని ముఠా వాహనాన్ని ఆపకపోగా, ఎస్‌ను ఆ వాహనంతోనే తొక్కించబోయారు. వెంటనే అప్రమత్తమైన కుప్పం రూరల్‌ సీఐ మల్లేశ్‌ యాదవ్‌.. కారులోని ముఠాపై ఓ రౌండ్‌ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అయినా వాహనాన్ని ఆపకుండా, వెనక్కి మళ్లించి తిరుపత్తూరు మార్గంలోకి తిప్పాడు. పోలీసులు మరో వాహనంలో దొంగలను వెంబడించారు. వేగంగా వెళ్లిన దొంగల వాహనం చివరకు పరమసముద్రం చెరువు గట్టుమీద పోలీసులకు కనిపించింది. అప్పటికే దోపిడీ దొంగలు పరారయ్యారు. ఆ గ్యాంగ్‌ను త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు.

Updated Date - Jun 05 , 2025 | 05:44 AM