Mulapadu Butterfly Park: ప్రకృతి ఒడిలో పరుగు..
ABN , Publish Date - Oct 27 , 2025 | 04:08 AM
ఉరుకుల పరుగుల జీవితం.. వాయు, శబ్ద కాలుష్యంతో సహజీవనం కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఈ రోజుల్లో కాంక్రీట్ జంగిల్ లాంటి నగరాలకు దూరంగా..
ఆహ్లాదకర వాతావరణంలో ‘హ్యాపీ ఫారెస్ట్ రన్’
మూలపాడు వద్ద 16కే, 8కే విభాగాల్లో నిర్వహణ
పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఉత్సాహంగా పరుగు
విజయవాడ సిటీ, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ఉరుకుల పరుగుల జీవితం.. వాయు, శబ్ద కాలుష్యంతో సహజీవనం కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఈ రోజుల్లో కాంక్రీట్ జంగిల్ లాంటి నగరాలకు దూరంగా.. ప్రశాంతమైన ప్రకృతికి దగ్గరగా.. ఒక్కరోజైనా గడపాలని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది..! ట్రైమెట్రిక్స్ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘హ్యాపీ ఫారెస్ట్ రన్’ అలాంటి మధురానుభూతినే అందించింది. విజయవాడ నగరానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మూలపాడు బటర్‌ఫ్లై పార్క్ వద్ద ఈ ట్రయల్ రన్‌ను నిర్వహించారు. ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు కొండ కోనల్లో ప్రశాంత వాతావరణంలో సాగిన ఈ రన్‌కు స్పందన లభించింది. 16కే, 8కే విభాగాల్లో సాగిన ఈ రన్‌లో వివిధ ప్రాంతాల నుంచి 160 మందికిపైగా ఔత్సాహికులు పాల్గొన్నారు. మూలపాడులోని కనువిందు చేసే బటర్‌ఫ్లై పార్క్‌లో సాగిన ఈ పరుగులో చిన్నారులు, యువకులు, గృహిణులు, వృద్ధులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పచ్చని చెట్ల మధ్య సాగుతూ, మట్టి రోడ్లపై నడుస్తూ, చిన్నిచిన్న మడుగులు దాటుకుంటూ ముందుకు కదిలారు. పక్షుల కిలకిలరావాలు, అందమైన పూల సువాసనలు, సెలయేటి సవ్వడులు, సీతాకోక చిలుకల సోయగాలను ఆస్వాదిస్తూ.. పచ్చదనం నిండిన ప్రకృతిలో స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ... హ్యాపీ ఫారెస్ట్ రన్‌ను ఎంచక్కా ఆస్వాదించారు. పరుగు దిగ్విజయంగా ముగించాక మెడల్ అందుకొని హ్యాపీగా తిరుగు ప్రయాణమయ్యారు.