Share News

Wildlife Protection: హనుమాన్‌ రక్ష..

ABN , Publish Date - Dec 02 , 2025 | 05:13 AM

మానవులు-వన్యప్రాణుల మధ్య సంఘర్షణలు, ముఖ్యంగా ఏనుగులతో ఎదురవుతున్న నష్టాలను నివారించడంతోపాటు అడవి జంతువుల సంరక్షణ కోసం రాష్ట్ర అటవీ శాఖ ఇటీవలే ‘హనుమాన్‌’ ప్రాజెక్టును ప్రారంభించింది.

Wildlife Protection: హనుమాన్‌ రక్ష..

  • వన్యప్రాణుల సంరక్షణ, పర్యవేక్షణకు కొత్త ప్రాజెక్ట్‌

  • ‘హనుమాన్‌’ ప్రాజెక్ట్‌లో కృత్రిమ మేధ వినియోగం

  • రూ.11.62 కోట్లతో పరికరాలు, వసతులు

  • తొలుత చిత్తూరు జిల్లాలో అమలు

  • త్వరలో రాష్ట్రమంతా విస్తరణ.. మార్చిలోగా కొత్త యాప్‌

  • డిప్యూటీ సీఎం చొరవతో చర్యలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

మానవులు-వన్యప్రాణుల మధ్య సంఘర్షణలు, ముఖ్యంగా ఏనుగులతో ఎదురవుతున్న నష్టాలను నివారించడంతోపాటు అడవి జంతువుల సంరక్షణ కోసం రాష్ట్ర అటవీ శాఖ ఇటీవలే ‘హనుమాన్‌’ ప్రాజెక్టును ప్రారంభించింది. అడవి జంతువుల వల్ల కలిగే ప్రమాదాలు, నష్టాలను తగ్గించడం, ప్రజల ప్రాణాలు, పంటలు, పశువులను రక్షించడంతోపాటు అడవి జంతువులను నిరంతరం పర్యవేక్షించడం, వాటిని సంరక్షించడం, వాటికి అవసరమైన సహాయం అందించాలనేది ‘హనుమాన్‌’ (హీలింగ్‌ అండ్‌ నర్చరింగ్‌ యూనిట్స్‌ ఫర్‌ మానిటరింగ్‌, ఎయిడ్‌ అండ్‌ నర్సింగ్‌ ఆఫ్‌ వైల్డ్‌లైఫ్‌) ప్రాజెక్టు లక్ష్యం. కృత్రిమ మేధ వంటి అత్యాధునిక సాంకేతికతతో నిర్వహించే ఈ ప్రాజెక్ట్‌ కోసం రూ.11.62 కోట్లు ఖర్చు చేయనున్నారు. ప్రకృతి, అడవులు, వన్యప్రాణులు, జీవివైవిధ్యం మెండుగా ఉన్న ఉత్తర, దక్షిణాంధ్రల్లో ఏనుగులు, పాపికొండల ప్రాంతంలో పులులు, రాష్ట్రవ్యాప్తంగా చిరుతలు, అడవి పందులు, పాములు, కోతులు, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఎలుగుబంట్లు, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కృష్ణ జింకలు, అటవీ సరిహద్దుల్లో చుక్కల జింకలు ఉన్నాయి. ఈ హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో ఇటీవల మానవ-వన్యప్రాణుల సంఘర్షణలు పెరిగాయి. ముఖ్యంగా ఏనుగుల గుంపు దాడులతో పంటలు, జనావాసాలు ధ్వంసం అవుతుండగా... పశువులతోపాటు మనుషులు కూడా చనిపోతున్నారు. ఇలాంటి సంఘటనల కారణంగా గత దశాబ్దకాలంలో 71 మంది మనుషులు మృతిచెందగా 29 మంది గాయపడ్డారు. అలాగే 722 జంతువులు కూడా చనిపోయాయి. 17,192 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. దీనికోసం అటవీశాఖ రూ.14.94 కోట్లు పరిహారంగా చెల్లించింది.


ఈ నేపథ్యంలో వన్యప్రాణులు, మనుషుల మధ్య సంఘర్షణలను తగ్గించేందుకు ఉపముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్‌కల్యాణ్‌ చొరవతో అటవీశాఖ ‘హనుమాన్‌’ (వన్యప్రాణుల పర్యవేక్షణ, సహాయం, వైద్యం, పోషణ కేంద్రాలు)కు రూపకల్పన చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా.. ఏనుగులతో సహా అడవి జంతువులను గుర్తించడానికి, అధికారులకు రియల్‌ టైమ్‌లో హెచ్చరికలు పంపడానికి కృత్రిమ మేధ, సౌరశక్తితో నడిచే వ్యవస్థలను ఉపయోగిస్తారు.


24/7 అందుబాటులో ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ వ్యాన్లు

వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా రూపొందించే ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ వ్యాన్లలో ప్రథమ చికిత్స పరికరాలతో పాటు కెమెరా ట్రాప్‌లు, డ్రోన్‌, రియల్‌టైమ్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌, నిఘా కోసం నైట్‌ విజన్‌ పరికరాలు, జీపీఎ్‌సలు ఉంటాయి. ఈ వాహనం 24/7 ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉంటుంది. ఈ వ్యాన్లలో వెటర్నరీ డాక్టర్‌, డ్రైవర్‌ కం ఫీల్డ్‌ అసిస్టెంట్‌, నలుగురు రెస్క్యూ సిబ్బంది ఉంటారు.ఈ వ్యాన్లను అల్లూరి, కృష్ణా, ఎన్టీఆర్‌, పల్నాడు, కడప, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. 4 ఆర్‌డబ్ల్యూఆర్‌టీసీ ప్రధాన కార్యాలయాల్లో ఏర్పాటు చేసే మొబైల్‌ వైల్డ్‌లైఫ్‌ అంబులెన్స్‌లతో పాటు పార్వతీపురం, అనంతపురం, మంగళగిరిలోనూ అదనపు అంబులెన్స్‌లు ఏర్పాటు చేస్తారు. హనుమాన్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా ఇప్పటికే ఉన్న ‘గజ’ యాప్‌ స్థానంలో జంతువుల సమాచారాన్ని ప్రజలకు చేరవేసేలా కొత్త యాప్‌ను రూపొందించి, మార్చి 3వ తేదీలోగా అందుబాటులోకి తేవాలని అటవీశాఖ నిర్ణయించింది.


పకడ్బందీగా హనుమాన్‌ ఫౌండేషన్‌ చర్యలు

చిత్తూరు జిల్లాలో మాదిరిగానే.. మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో ఏనుగుల కదలికలు, గమనాన్ని ఆధునిక సాంకేతికతతో గుర్తిస్తారు. వాటితో పాటు ఏవైనా వన్యప్రాణులు అటవీ హద్దులు దాటినప్పుడు స్థానికులకు హెచ్చరికలు పంపడం, పొలాల చుట్టూ రాత్రిపూట ఆటోమేటిక్‌ లేజర్‌ ఫెన్సింగ్‌, కృత్రిమ మేధతో వర్చువల్‌ జియో ఫెన్సింగ్‌తో జంతువులను నిరోధించేలా సోలార్‌ లైన్ల ఏర్పాటు, జంతువులు పారిపోయేలా సైరన్లు మోగించడం, బాగా కాంతి వచ్చే ఫ్లాష్‌ లైట్లు వంటివి వినియోగిస్తారు. ఇటీవల తిరుపతి, చిత్తూరు జిల్లాల పర్యటనలో ‘హనుమాన్‌’ వివరాలను తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌... దీనిని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు సమాచారంతో పోస్టర్‌ను ఆవిష్కరించారు.


రాజమహేంద్రవరంలో వన్యప్రాణుల డిస్పెన్సరీ

ప్రాంతీయ వన్యప్రాణుల రక్షణ, చికిత్స కేంద్రాలు (ఆర్‌డబ్ల్యూఆర్‌టీసీ)గా ప్రస్తుతం తిరుపతిలో ఉన్న శ్రీవెంకటేశ్వర జూలాజికల్‌ పార్కు, విశాఖ, బైర్లుటీ వద్ద ఉన్న వన్యప్రాణుల డిస్పెన్సరీలను వినియోగించనున్నారు. అవసరాన్ని బట్టి ఈ డిస్పెన్సరీలను అప్‌గ్రేడ్‌ చేస్తారు. మరిన్ని సౌకర్యాలతో రాజమహేంద్రవరంలో ఒక డిస్పెన్సరీ ఏర్పాటు చేయనున్నారు. ప్రతి డిస్పెన్సరీలో ఒక పశువైద్యుడు, ఇద్దరు పారా స్టాఫ్‌, ఒక జీవశాస్త్రవేత్త, నలుగురు జంతు సంరక్షకులు, ఒక నర్సు లేదా వెటర్నరీ టెక్నీషియన్‌, అంబులెన్స్‌ డ్రైవర్‌ అందుబాటులో ఉంటారు. ఈ నాలుగు ప్రాంతీయ వన్యప్రాణుల రక్షణ, చికిత్స కేంద్రాలకు వన్యప్రాణులకు సేవలందించాల్సిన జిల్లాల పరిధిని నిర్ణయించారు. హాట్‌స్పాట్‌లుగా గుర్తించిన ప్రాంతాల్లో అడవి జంతువుల సంఖ్య, వాటి ప్రవర్తనను గమనించడం, స్థానిక అటవీ సిబ్బందికి సమాచారం ఇవ్వడం, వేగంగా ప్రతిస్పందించడం, స్థానికులకు హెల్ప్‌లైన్‌పై అవగాహన కల్పించడం, మొబైల్‌ అంబులెన్స్‌ టీమ్‌లకు శిక్షణ ఇవ్వడం, జంతువుల రోగ నిర్ధారణ, పరిశోధన కోసం ప్రాంతీయ పశువైద్య కళాశాలలతో అనుసంధానమయ్యేలా ఆర్‌డబ్ల్యూఆర్‌టీసీలకు నిర్దేశించారు.

అందుకే ‘హనుమాన్‌’ పేరు

అడవులతో హనుమంతుడికి ఉన్న ప్రత్యేక అనుబంధం నేపథ్యంలో ఈ ఫౌండేషన్‌కు ‘హనుమాన్‌’ అనే పేరు పెట్టినట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ ప్రాజెక్టు లక్ష్యం మేరకు... ఏనుగులు, పులులు, సింహాలు, ఎలుగుబంట్లు, జింకలు, కోతులు వంటి వన్యప్రాణులను కాపాడుతూనే.. వాటి నుంచి మనుషులను రక్షించడానికి చర్యలు తీసుకుంటున్నారు. వేటగాళ్ల నుంచి వన్యప్రాణులకు హాని లేకుండా చూడటం కూడా ప్రాజెక్టు లక్ష్యాల్లో ఒకటి. ప్రతి జంతు జాతికీ ఒక బృందాన్ని ఏర్పాటు చేసి... వాటి సంరక్షణ, పోషణ, అవసరమైన వైద్యసేవలు కూడా అందించనున్నారు. అటవీశాఖలోని ప్రతి డివిజన్‌కు ఒక అంబులెన్స్‌ ఏర్పాటుచేసి జంతువుల వైద్యానికి అవసరమైన మందుల్ని అందుబాటులో ఉంచుతారు. అటవీ జంతువులతో పాటు పట్టణాలు, గ్రామాల్లోనూ జనవాసాల్లోకి వచ్చే విష సర్పాల నుంచి ప్రజలకు హాని జరగకుండా ‘సర్పమిత్ర’ పేరిట ప్రతి పంచాయితీలోనూ వలంటీర్లను ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.

Updated Date - Dec 02 , 2025 | 05:14 AM