Share News

Kurnool Handloom Industry: మగ్గాలపై మ్యాజిక్‌..

ABN , Publish Date - Aug 04 , 2025 | 04:13 AM

పోగు పోగు వడికి అందమైన వస్త్రాలు తయారుచేసే చేనేత కార్మికుల కళానైపుణ్యం చూసి అబ్బురపడని వారుండరు...!

Kurnool Handloom Industry: మగ్గాలపై మ్యాజిక్‌..

  • చేనేతపురి ఉత్పత్తులకు దేశవిదేశాల్లో మంచి ఆదరణ

  • ఆకట్టుకునే డిజైన్లలో బర్డ్స్‌ ఐ తువాళ్లు, జిందగీ దుప్పట్లు

  • ఆకర్షించేలా చేతి రుమాళ్లు, లుంగీలు, ధోవతులు, చీరలు

  • మరమగ్గాల పోటీని తట్టుకుంటూ సహజ రంగుల్లో వస్త్రాలు

  • మగ్గాలపై కష్టించే నేతన్నల శ్రమకు గుర్తింపు దక్కే చాన్స్‌

  • ఎమ్మిగనూరు నేతన్నల నైపుణ్యానికి భౌగోళిక గుర్తింపు తీసుకొచ్చే దిశగా చకచకా అడుగులు

  • జీఐ ట్యాగ్‌ వస్తే అంతర్జాతీయంగా మరింత పేరు

మరమగ్గాలపై నేసే వస్త్రాలు కావివి..! పోగుపోగు వడికి.. సహజమైన రంగులద్ది.. విభిన్న డిజైన్లతో చేనేత కార్మికుల చేతుల నుంచి జాలువారిన అద్భుత కళా ఖండాలివి..! కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నేతన్నల ప్రత్యేక శైలికి ప్రత్యక్ష నిదర్శనాలివి..! చెక్క మగ్గాలపై తయారవుతున్న బర్డ్స్‌ ఐ తువాళ్లు, జిందగీ దుప్పట్లు, చేతి రుమాళ్లకు దేశవిదేశాల్లో మంచి ఆదరణ ఉంది. ఇప్పుడు వీటికి భౌగోళిక గుర్తింపు సాధించే దిశగా అడుగులు పడుతున్నాయి.

(కర్నూలు - ఆంధ్రజ్యోతి)

పోగు పోగు వడికి అందమైన వస్త్రాలు తయారుచేసే చేనేత కార్మికుల కళానైపుణ్యం చూసి అబ్బురపడని వారుండరు...! కాళ్లు, చేతులతో పనిచేస్తూనే.. కళ్లను మగ్గంపై కేంద్రీకరించి ఎన్నో అద్భుత కళాఖండాలు సృష్టించే చేనేతల్లో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నేతన్నలది ప్రత్యేక శైలి..! మగ్గాలపై మ్యాజిక్‌ చేసినట్టుగా ఇక్కడి ‘చేనేతపురి’లో రూపం పోసుకుంటున్న బర్డ్స్‌ ఐ తువాళ్లు, జిందగీ దుప్పట్లు, చేతిరూమాళ్లకు దేశవిదేశాల్లో మంచి ఆదరణ ఉంది. మరమగ్గాల పోటీని తట్టుకుంటూ సహజమైన రంగులు, విభిన్న డిజైన్లతో చెక్క మగ్గాలపై రూపొందించిన ఈ ఉత్పత్తులు ప్రపంచమార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో ఇక్కడి నేతన్నల శ్రమకు తగిన గుర్తింపు లభించేందుకు మార్గం సుగమం అవుతోంది. ఇక్కడ ఉత్పత్తి చేసే బర్డ్స్‌ఐ తువాళ్లు, జిందగీ దప్పట్లకు భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్‌) తీసుకొచ్చేందుకు హైదరాబాద్‌కు చెందిన ‘రిజల్యూట్‌ బీ2బీ’ సంస్థ కృషి చేస్తోంది.


దేశంలో తనకంటూ ఒక బ్రాండ్‌..

కర్నూలు జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఎమ్మిగనూరు ఒకటి. 1930వ దశకంలో పేదరికం, నిరుద్యోగం, కరువు, ఆకలి మరణాలతో ఆ ప్రాంతం అల్లాడిపోయేది. ఆ సమయంలో చేనేత కార్మికులకు ఉపాధి చూపించి ఆకలి తీర్చాలనే సంకల్పంతో పద్మశ్రీ మాచాని సోమప్ప 1938లో ‘ఎమ్మిగనూరు చేనేత సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం లిమిటెడ్‌’ను స్థాపించారు. ఇది క్రమేపీ దేశంలోనే అత్యుత్తమ చేనేత వస్త్ర ఉత్పత్తికి బ్రాండ్‌గా మారింది. దుప్పట్లు (బెడ్‌షీట్లు), తువాళ్లు, లుంగీలు, చేతి రుమాళ్లు, దోమతెరలు, చొక్కాలు క్లాత్‌, ధోవతులు, చీరలు.. వంటి వివిధ చేనేత ఉత్పత్తులకు కేంద్రంగా మారి.. ‘చేనేతపురి’గా ఖ్యాతి గడించింది. ఒకప్పుడు 2వేల మందికిపైగా చేనేత కార్మికులు సభ్యులుగా ఉండేవారు. ప్రస్తుతం 450 మంది వరకు ఉన్నారు. వీళ్లు తయారుచేసే ఉత్పత్తుల్లో జిందగీ దుప్పట్లు, బర్డ్స్‌ ఐ తువాళ్లు ఎంతో ఆదరణ పొందాయి. ఇక్కడి వస్త్రాలకు ‘నేషనల్‌ హ్యాండ్‌లూమ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌’ (ఎన్‌హెచ్‌డీసీ) గుర్తింపు పొందిన తమిళనాడులోని కోయంబత్తూరు, కర్ణాటకలోని దావణగేరి డిపోల ద్వారా సరఫరా చేసే నూలు దారాలు వినియోగిస్తున్నారు. ఇక్కడి వస్త్రాలను హైదరాబాద్‌, విజయవాడ, అమరావతి, కాకినాడ, అనంతపురం, రాయచూరు, గుల్బర్గ సహా దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. దాదాపు వందేళ్ల చరిత్ర కలిగిన ఎమ్మిగనూరు చేనేత వస్త్రాలకు ఒక నిర్దిష్ట ప్రాంతానికి చెందిన ఉత్పత్తులకు ఇచ్చే భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్‌) లేదు. ఈ నేపథ్యంలోచేనేతపురి ఉత్పత్తులకు జీఐ ట్యాగ్‌ సాధించేందుకు ‘రిజల్యూట్‌ బీ2బీ’ సంస్థ కృషి చేస్తోంది. దీనికోసం అవసరమైన పత్రాలను సిద్ధం చేస్తోంది. ఆ సంస్థ ప్రతినిధులు ఇటీవల క్షేత్రస్థాయిలో పర్యటించి చేనేత కార్మికులతో మాట్లాడారు. ఉత్పత్తిలో వినియోగిస్తున్న నూలు దారాలు, రంగులు, చెక్క మగ్గాలపై నేత నైపుణ్యం, విక్రయాలు, ఎగుమతులు.. ఇలా పలు అంశాలను పరిశీలించారు. ఆ సంస్థ ప్రతినిధులు సమగ్ర వివరాలతో కూడిన పత్రాలు, వీడియోలు సేకరించి.. భౌగోళిక గుర్తింపు సాధించేందుకు కృషి చేస్తున్నారని ఏపీ చేనేత, జౌళి శాఖ కర్నూలు జిల్లా ఏడీ నాగరాజు యాదవ్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. జీఐ సర్టిఫికెట్‌ వస్తే బర్డ్స్‌ ఐ తువాళ్లు, జిందగీ దుప్పట్లకు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు లభిస్తుందన్నారు.


ఆకట్టుకునే దుప్పట్లు.. భళా అనిపించే తువాళ్లు..

ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో మగ్గంపై నేతన్నలు తయారుచేసే ‘జిందగీ దుప్పట్లు’ నేత నైపుణ్యానికి అద్దం పడుతున్నాయి. ఒక దుప్పటి పొడవు 2.29 మీటర్లు, వెడల్పు 1.52 మీటర్లు ఉంటుంది. వీటి తయారీకి 2/70 కౌంట్‌ యారాన్‌ వినియోగిస్తారు. తొక్కుడు చెక్క మగ్గంపై వీటిని నేస్తారు. ఈ దుప్పట్లు చాలా మృదువుగా ఉంటాయి. ఒక్కో మగ్గంపై రోజుకు రెండు దుప్పట్లు ఉత్పత్తి చేస్తారు. తువాళ్లను పరిశీలిస్తే ‘పక్షి కన్ను’ రూపంలో కనిపిస్తాయి. అందుకే వీటిని ‘బర్డ్స్‌ ఐ’ తువాళ్లు అని పిలుస్తారు. తొక్కుడు చెక్క మగ్గాలపై నేసే ఈ తువాళ్లు మృదువుగా ఉంటాయి. ఒక్కో తువాలు 1.60 మీటర్లు పొడవు, 0.75 మీటర్లు వెడల్పు ఉంటుంది. రోజుకు 5-6 తువ్వాళ్లు నేత నేస్తారు. పర్యావరణాన్ని కాపాడే సహజసిద్ధమైన రంగులు వేస్తారు.

Untitled-2 copy.jpg


భౌగోళిక గుర్తింపు వస్తే కూలీ రేట్లు పెరుగుతాయి

‘మా తాతల కాలం నుంచి చేనేత మగ్గంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. ఎమ్మిగనూరు చేనేత సహకారం సంఘం ఆధ్వర్యంలో బర్డ్స్‌ ఐ తువాళ్లు నేస్తున్నాను. ఒక తువాలు నేస్తే రూ.35-40 కూలీ ఇస్తున్నారు. రోజుకు నాలుగైదు తువాళ్లకు మించి ఉత్పత్తి చేయలేకపోతున్నాం. హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ వచ్చి సర్వే చేసింది. మా తువాళ్లకు భౌగోళిక గుర్తింపు వస్తే డిమాండ్‌ పెరుగుతుంది. కూలీ రేట్లు కూడా పెరుగుతాయి. ప్రభుత్వం ఆప్కో ద్వారా ఇచ్చే రాయతీలు పెంచి చేనేత కార్మికులకు ప్రోత్సాహం అందించాలి.’

- పొబ్బతి నాగరాజు, బర్డ్స్‌ ఐ తువాళ్ల నేత కార్మికుడు,

ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా


15 ఏళ్లుగా జిందగీ దుప్పట్లు నేస్తున్నాను

‘నలభై ఏళ్లుగా మగ్గంపై వివిధ చేనేత వస్త్రాలు నేస్తున్నాను. 15 ఏళ్ల నుంచి ఎమ్మిగనూరు చేనేత సోసైటీ ఇచ్చే జిందగీ దుప్పట్లు నేస్తున్నాను. ఒక దుప్పటి నేస్తే రూ.150 ఇస్తున్నారు. రోజుకు రెండు దుప్పట్లు కూడా నేయలేకపోతున్నాం. కూలీ రేట్లు పెంచి ఒక్కో దుప్పటికి రూ.250-300 ఇవ్వాలి. భౌగోళిక గుర్తింపు కోసం కొంతమంది వచ్చి సర్వే చేసి వెళ్లారు. మా ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తే మాకూ ఎంతో గర్వంగా ఉంటుంది.’

- కె ఆదెమ్మ, చేనేత కార్మికురాలు, ఎమ్మిగనూరు,

కర్నూలు జిల్లా


నేతన్నలకు మెరుగైన ఉపాధి

‘ఎమ్మిగనూరు చేనేత వస్త్రాలకు దేశవిదేశాల్లో మంచి ఆదరణ ఉంది. దేశవ్యాప్తంగా 16 విక్రయ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడి బర్డ్స్‌ ఐ తువాళ్లు, జిందగీ దుప్పట్లు ఎంతో ప్రత్యేకమైనవి. ఇప్పటివరకు వీటికి జీఐ ట్యాగ్‌ రాలేదు. హైదరాబాద్‌కు చెందిన ‘రిజల్యూట్‌ బీ2బీ’ సంస్థ ప్రతినిధులు ఎమ్మిగనూరులో పర్యటించి జీఐ రిజిస్ట్రేషన్‌ కోసం అవసరమైన పత్రాలు సిద్ధం చేశారు. జీఐ సర్టిఫికెట్‌ వస్తే ఇక్కడ ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు వస్తుంది. సొసైటీ మరింత అభివృద్ధి చెందుతుంది. కూలీ రేట్లు కూడా పెరుగుతాయి.’

- ఎమ్మిగనూరు చేనేత సహకార ఉత్పత్తి,

విక్రయ సంఘం లిమిటెడ్‌ ఏడీ అప్పాజీ

Updated Date - Aug 04 , 2025 | 04:17 AM