Share News

ఇంటి పన్నుల్లోనూ చేతివాటం!

ABN , Publish Date - Nov 05 , 2025 | 12:46 AM

తోట్లవల్లూరు గ్రామ పంచాయతీ అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. షాపింగ్‌ కాంప్లెక్స్‌ల్లోని అద్దె దారుల నుంచి నగదు వసూలు చేసి జూనియర్‌ అసిస్టెంట్‌ సునీల్‌కుమార్‌ వాడేసుకున్నాడు. విచారణలో నిర్ధారణ కావడంతో అతన్ని అధికారులు సోమవారం సస్పెండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఇంటి పన్నులు కట్టించుకుని పంచాయతీకి జమ చేయని విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు సిబ్బంది చేతివాటం చూపుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. తన ఇంటి పన్నును గుర్తు తెలియని వ్యక్తితో కట్టించుకుని, అతనికి రశీదు కూడా ఇవ్వడంపై ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పంచాయతీలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించాడు.

ఇంటి పన్నుల్లోనూ చేతివాటం!

-అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా తోట్లవల్లూరు పంచాయతీ

-కాంట్రాక్టు సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి లీలలు

-పన్నులు కట్టినా బకాయి చూపిస్తున్న స్వర్ణ పంచాయతీ సైట్‌

-ఇంటి పన్ను అక్రమాలపై పోలీస్‌స్టేషన్‌లో ఓ వ్యక్తి ఫిర్యాదు

-ఇప్పటికే షాపుల అద్దె వాడేసుకున్న జూనియర్‌ అసిస్టెంట్‌ సునీల్‌కుమార్‌ సస్పెండ్‌

తోట్లవల్లూరు గ్రామ పంచాయతీ అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. షాపింగ్‌ కాంప్లెక్స్‌ల్లోని అద్దె దారుల నుంచి నగదు వసూలు చేసి జూనియర్‌ అసిస్టెంట్‌ సునీల్‌కుమార్‌ వాడేసుకున్నాడు. విచారణలో నిర్ధారణ కావడంతో అతన్ని అధికారులు సోమవారం సస్పెండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఇంటి పన్నులు కట్టించుకుని పంచాయతీకి జమ చేయని విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు సిబ్బంది చేతివాటం చూపుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. తన ఇంటి పన్నును గుర్తు తెలియని వ్యక్తితో కట్టించుకుని, అతనికి రశీదు కూడా ఇవ్వడంపై ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పంచాయతీలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించాడు.

ఆంధ్రజ్యోతి-తోట్లవల్లూరు :

తోట్లవల్లూరు గ్రామ పంచాయతీ అవినీతి, అక్రమాల ఊబిలో కూరుకుపోయింది. జూనియర్‌ అసిస్టెంట్‌ ఎల్‌.సునీల్‌కుమార్‌ను జిల్లా పంచాయతీ అధికారి జె.అరుణ సోమవారం సస్పెండ్‌ చేయటంతో మరిన్ని అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. గ్రామ పంచాయతీకి చెందిన 14 షాపింగ్‌ కాంప్లెక్స్‌ల్లో అద్దెదారుల నుంచి సునీల్‌కుమార్‌ రూ.1,49,600 వసూలు చేసి పంచాయతీకి జమ చేయలేదు. అద్దె సొమ్ము తీసుకుని అద్దెదారులకు బిల్లులు ఇవ్వకుండా మూడు నెలల పాటు ఇబ్బంది పెట్టినట్టు రుజువయింది. అద్దెదారులు ఒత్తిడి చేయటంతో పంచాయతీ కార్యదర్శికి తెలియకుండా కార్యదర్శి స్టాంప్‌ముద్ర వేసి జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉన్న సునీల్‌కుమార్‌ సంతకం చేయటం మరింత వివాదంగా మారింది. అద్దె సొమ్మును చలానా రూపంలో పంచాయతీకి చెల్లించి ఆ తర్వాత డ్రా చేసి ఖర్చు చేయాల్సి ఉంది. అక్టోబర్‌ 16న డీఎల్‌పీవో విచారణకు వచ్చినపుడు ఈ లోపాలు బయటపడ్డాయి. ఆ తర్వాత అద్దె సొమ్మును పంచాయతీకే ఖర్చు చేసినట్టుగా బిల్లులు తెచ్చినా ఫలితం దక్కలేదు. ఇలా తప్పులు మీద తప్పులు చేసి సునీల్‌కుమార్‌ సస్పెండ్‌కు గురయ్యాడని చెప్పవచ్చు. జూనియర్‌ అసిస్టెంట్‌గా ఇంకా అనేక అక్రమాలు చేసినట్టుగా ఆరోపణలు బయటకు వస్తున్నాయి.

ఇంటి పన్నుల్లో భారీగా దోపిడీ

తోట్లవల్లూరు పంచాయతీలో ఇంటి పన్నులను పక్కదారి పిట్టించినట్టు బలమైన ఆధారాలు వెలుగు చూస్తున్నాయి. సునీల్‌కుమార్‌ సస్పెండ్‌ అంశం గ్రామంలో చర్చనీయాంశంగా మారటంతో ఇంటి పన్నులు తాము కట్టినప్పటికీ బకాయిలు పెట్టాశారని పలువురు ఆరోపిస్తున్నారు. వీరంకి శ్రీనివాసరావు తన ఇంటికి సంబంధించి 2023-24 సంవత్సరానికి రూ.187లను 2025 మార్చి 16వ తేదీన చెల్లించగా, 300428 నెంబరు గల రశీదుని పంచాయతీ వారు ఇచ్చారు. కానీ ఈ రూ.187లను పంచాయతీలో జమ చేయకపోవటంతో శ్రీనివాసరావు బకాయి ఉన్నట్టు స్వర్ణ పంచాయితీ వెబ్‌సైట్‌లో చూపుతోంది. మరొక ప్రముఖ వ్యక్తి నుంచి ఇంటి పన్ను డబ్బులు తీసుకుని, రశీదు మరలా ఇస్తామని చెప్పి రశీదు ఇవ్వకుండా, పంచాయతీలో జమ చేయకుండా సొంతానికి వాడేసుకున్నారు. ఇలా అనేక మంది వద్ద మూడు సంవత్సరాల నుంచి ఇంటి పన్నులను ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు వాడేసుకుంటూ పంచాయతీకి నష్టం కలిగిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు నిక్కచ్చిగా పూర్తిస్థాయిలో విచారణ జరిపితే రూ.లక్షల్లో అక్రమాలు తేలే అవకాశం ఉంది.

కాంట్రాక్టు సిబ్బందిపై ఆరోపణలు

తోట్లవల్లూరు పంచాయతీలో బిల్‌ కలెక్టర్‌ లేరు. దీంతో కాంట్రాక్టు సిబ్బందితో ఇంటి పన్నులు, నీటి పన్నులు వసూలు చేస్తున్నారు. ఎప్పటి నుంచో పాతుకుపోయిన కాంట్రాక్టు సిబ్బంది ఇష్టానుసారంగా పంచాయతీ డబ్బులను దుర్వినియోగం చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. జూనియర్‌ అసిస్టెంట్‌, కాంట్రాక్టు సిబ్బంది చేతివాటం బాగ పెరిగిందని తెలుస్తోంది. వీరంకి శ్రీనివాసరావు 2024-25 సంవత్సరానికి సంబంధించి ఇంటి పన్ను చెల్లించేందుకు పంచాయతీకి వెళితే నీవు పన్ను కట్టేశావని జూనియర్‌ అసిస్టెంట్‌ సునీల్‌కుమార్‌ చెప్పారు. కాంట్రాక్టు సిబ్బంది బాషాకు ఇంటి పన్ను చెల్లించావని చెపితే నేను ఎవ్వరికి కట్టలేదు. నా ఇంటి పన్ను ఎవ్వరి చేత కట్టించారో తేల్చాలని శ్రీనివాసరావు పట్టుబడితే ఇంటిపన్ను రశీదు నాలిక గీసుకోటానికి కూడా పనికిరాదు పో అని పంచాయతీలో సమాధానం ఇవ్వటంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పంచాయతీలో ఇష్టారాజ్యం

- వీరంకి శ్రీనివాసరావు, తోట్లవల్లూరుల

తోట్లవల్లూరు పంచాయతీలో అవినీతి పెరిగిపోయింది. ఎవరి ఇష్టారాజ్యం వారిదయింది. నాకు రెండు అన్యాయాలు జరిగాయి. 2023-24లో ఇంటి పన్ను స్వయంగా చెల్లించాను. ఆ డబ్బులను తినేశారు. ఇపుడు 2023-24 ఇంటి పన్ను చెల్లించాలంటున్నారు. నా దగ్గర ఒరిజినల్‌ రశీదు ఉంది. అలాగే 2024-25 ఇంటి పన్ను చెల్లించేందుకు వెళితే ఎవ్వరో వస్తే బిల్లు కట్టించుకుని రశీదు అతనికి ఇచ్చామని చెప్పారు. నా ఇంటి పన్ను రశీదుతో రేపు ఎవ్వరైనా అక్రమాలకు పాల్పడితే ఎవ్వరు బాధ్యత వహిస్తారో చెప్పాలంటే సమాధానం లేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశా. పంచాయితీ కార్యదర్శి, పోలీసులు నాకు న్యాయం చేయలేదు.

కార్యదర్శిదే బాధ్యత

- పెనుముత్స రాధిక, సర్పంచ్‌, తోట్లవల్లూరు

తోట్లవల్లూరు పంచాయతీలో అవినీతి ఆరోపణలకు కార్యదర్శి బాధ్యత వహించాలి. ఆయనే పర్యవేక్షణాధికారి, ఈ అవినీతిలో తనకెలాంటి సంబంధం లేదు.

అన్యాయం జరిగితే అర్జీలు ఇవ్వండి

ఆర్‌.శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి

ఈ ఏడాది సెప్టెంబర్‌ 6వ తేదీన ఇక్కడ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించా. జూనియర్‌ అసిస్టెంట్‌ సునీల్‌కుమార్‌ అన్ని నిబంధనలు ఉల్లంఘించాడు. చలానా కట్టి పంచాయతీకి చెల్లించకుండా నిధులను వాడేందుకు నిబంధనలు ఒప్పుకోవు. నేను రాకముందు వసూలు చేసిన బిల్లులను పంచాయతీకి కట్టలేదు. నా స్టాంప్‌ ముద్ర వేసి సునీల్‌కుమార్‌ సంతకం చేసి అక్రమంగా అద్దెదారులకు రశీదులు ఇచ్చాడు. ఇంటి పన్నుల్లో అన్యాయం జరిగిందన్న వారు వచ్చి తనకు అర్జీలు అందించాలి.

Updated Date - Nov 05 , 2025 | 12:46 AM