Share News

Mega DSC: కొత్త టీచర్లలో సగం మహిళలే!

ABN , Publish Date - Sep 16 , 2025 | 04:15 AM

మెగా డీఎస్సీలో 15,941 మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించారు. 16,347 పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేయగా అభ్యర్థుల కొరతతో 406 పోస్టులు మిగిలిపోయాయి..

Mega DSC: కొత్త టీచర్లలో సగం మహిళలే!

  • టీచర్‌ పోస్టుల్లో సగం వారికే సొంతం

  • ఉపాధ్యాయులుగా ఎంపికైన 15,941 మంది

  • మిగిలిన పోస్టులు 406.. మిగులులో కర్నూలు, చిత్తూరు టాప్‌

  • జిల్లాల వారీగా ఉద్యోగాలు పొందినవారి జాబితాలు విడుదల

  • 150 రోజుల్లోనే డీఎస్సీ ప్రక్రియ పూర్తి

  • 19న కొత్త టీచర్లకు సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు

అమరావతి, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీలో 15,941 మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించారు. 16,347 పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేయగా అభ్యర్థుల కొరతతో 406 పోస్టులు మిగిలిపోయాయి. టీచర్‌ ఉద్యోగాలకు ఎంపికైన వారి పేర్ల తుది జాబితాలను మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ సోమవారం ఎక్స్‌లో విడుదల చేశారు. కొత్త టీచర్లకు విద్యాశాఖలోకి ఆహ్వానం పలికారు. అనంతరం విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ వి.విజయరామరాజు సచివాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు తొలి సంతకం, మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నారా లోకేశ్‌ తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైలుపైనే పెట్టారని గుర్తుచేశారు. పది మేనేజ్‌మెంట్ల పాఠశాలల్లో 16,347 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేశామని తెలిపారు. ఇప్పటి వరకూ వందకు పైగా కేసులు మెగా డీఎస్సీపై వచ్చాయని, వాటిని అధిగమించి పారదర్శకంగా ప్రక్రియ పూర్తిచేశామని చెప్పారు. 3,36,300 మంది అభ్యర్థులు 5,77,675 దరఖాస్తులు చేసుకున్నారన్నారు. ప్రాథమిక కీలపై 1.4 లక్షల అభ్యంతరాలు వచ్చాయని, వాటిని పరిష్కరించి తుది కీలు విడుదల చేశామని వివరించారు. మిగిలిపోయిన 406 పోస్టులను క్యారీ ఫార్వార్డ్‌ విధానంలో తర్వాత డీఎస్సీలో భర్తీ చేస్తామన్నారు. అంతేగానీ ఈ డీఎస్సీలో వెయిట్‌ లిస్ట్‌, రెండో జాబితాలు ఉండవని అధికారులు స్పష్టంచేశారు. ఈ డీఎస్సీలో తొలిసారి హారిజంటల్‌ రిజర్వేషన్‌, ఎస్సీ వర్గీకరణ ఉత్తర్వులు అమలుచేశామని తెలిపారు. ఎంపికైన 15,941 మందిలో 7,955 (49.9శాతం) మంది మహిళలు, 7,986 (50.97శాతం) పురుషులు ఉన్నారని తెలిపారు.


నవంబరులో టెట్‌.. ఏటా డీఎస్సీ

ఈ నెల 19న ఎంపికైన వారికి సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేస్తారన్నారు. 22 నుంచి 29 వరకు కొత్త టీచర్లకు శిక్షణ, కౌన్సెలింగ్‌ ఉంటుందని చెప్పారు. హారిజంటల్‌ రిజర్వేషన్‌ విధానంపై సందేహాలను నివృత్తి చేసేందుకు డీఈవో కార్యాలయాల్లో హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేశామన్నారు. ఇకపై ప్రతి ఏటా డీఎస్సీ ప్రకటిస్తామని, రాబోయే నంబరులో టెట్‌ జరుగుతుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. గతంలో వెయిటింగ్‌ జాబితా ఉండేదని, కానీ ఇప్పుడు ఒక పోస్టుకు ఒకరు చొప్పునే సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రాధాన్యతలపై న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలపై న్యాయ సలహా తీసుకుంటామన్నారు. అభ్యర్థులు ఇచ్చిన ప్రాధాన్యతల ఆధారంగానే ఎంపిక జరిగిందని, మొత్తం 150 రోజుల వ్యవధిలోనే మెగా డీఎస్సీ ప్రక్రియ పూర్తయ్యిందని చెప్పారు. తర్వాత స్పెషల్‌ డీఎస్సీపైనా కసరత్తు ప్రారంభిస్తామన్నారు. కాగా ఉమ్మడి కర్నూలులో అత్యధికంగా 88, చిత్తూరు 70 పోస్టులు మిగిలాయి.

లోకేశ్‌ అభినందనలు

కొత్త టీచర్ల ఎంపిక జాబితాలను విడుదల చేసిన మంత్రి లోకేశ్‌ మెగా డీఎస్సీపై ఎక్స్‌ వేదికగా స్పందించారు. సీఎం తొలి సంతకం చేసిన మెగా డీఎస్సీ హామీని నెరవేర్చామని లోకేశ్‌ పేర్కొన్నారు. 150 రోజుల్లోనే పాఠశాల విద్యాశాఖ విజయవంతంగా మెగా డీఎస్సీని పూర్తిచేసిందని తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి లోకేశ్‌ శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారుల మేధస్సును తీర్చిదిద్దుతూ ఏపీ మోడల్‌ విద్యా విధానాన్ని ప్రతి తరగతి గదికి చేర్చే దిశగా కొత్త టీచర్లు ముందుకు సాగబోతున్నారని లోకేశ్‌ పేర్కొన్నారు. కొత్త టీచర్లను ఆత్మీయంగా ఆహ్వానించి, వారికి మార్గనిర్దేశం చేయాలని ఉపాధ్యాయ వర్గానికి మంత్రి సూచించారు. ఈ డీఎస్సీలో అవకాశం అందుకోలేకపోయినవారు నిరుత్సాహపడొద్దని, ఇచ్చిన హామీ ప్రకారం ఇకపై ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని మంత్రి లోకేశ్‌ పునరుద్ఘాటించారు.

Updated Date - Sep 16 , 2025 | 04:15 AM