Share News

Bar Policy Failure: సగం బార్లు మిగులు

ABN , Publish Date - Aug 31 , 2025 | 06:16 AM

కొత్త మద్యం పాలసీ మొట్టమొదటిసారి రాష్ట్రంలో ఘోరంగా విఫలమైంది. గతంలో షాపులకు గానీ, బార్లకు గానీ పాలసీ ప్రకటిస్తే వ్యాపారులు ఎగబడేవారు. అలాంటిది తొలిసారి ఈ వ్యాపారం వద్దంటూ...

Bar Policy Failure: సగం బార్లు మిగులు

  • ఘోరంగా విఫలమైన కొత్త బార్‌ పాలసీ

  • 466 బార్లకే లాటరీలో లైసెన్స్‌లు జారీ

  • రేపటి వరకు గడువు పొడిగింపు

  • ఎల్లుండి లాటరీ తీస్తామన్న ఎక్సైజ్‌ శాఖ

  • దరఖాస్తులే రాని 421 బార్లకు త్వరలోనే రీనోటిఫికేషన్‌

అమరావతి, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): కొత్త మద్యం పాలసీ మొట్టమొదటిసారి రాష్ట్రంలో ఘోరంగా విఫలమైంది. గతంలో షాపులకు గానీ, బార్లకు గానీ పాలసీ ప్రకటిస్తే వ్యాపారులు ఎగబడేవారు. అలాంటిది తొలిసారి ఈ వ్యాపారం వద్దంటూ వెనకడుగు వేయడం విస్తుగొల్పుతోంది. సగానికిపైగా బార్లకు ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడం గమనార్హం. చివరకు మిగతావాటికే శనివారం లాటరీ నిర్వహించి లైసెన్సీలను ఎంపిక చేశారు. ఓపెన్‌ కేటగిరీలో 840, కల్లుగీత కులాలకు 84 బార్లకు (మొత్తం 924) ఇటీవల నోటిఫికేషన్‌ జారీ అయింది. ఓపెన్‌ కేటగిరీ బార్లు 388, గీత కులాల బార్లు 78 శనివారం లాటరీలోకి వచ్చాయి. ఇంకా 458 బార్లు దరఖాస్తులు రాక మిగిలిపోయాయి. వీటిలో 37 బార్లకు నాలుగు కంటే తక్కువ దరఖాస్తులు అందాయి. 4 దరఖాస్తులు వస్తేనే లాటరీ తీయాలనే నిబంధన ఉండడంతో వాటికి లాటరీ నిర్వహించలేదు. ఈ 37 బార్లకు దరఖాస్తులు సమర్పించే గడువును సోమవారం సాయంత్రం 6 గంటల వరకు పొడిగించారు. 2న లాటరీ తీస్తారు. అసలు దరఖాస్తులు రాని 421 బార్లకు త్వరలో రీనోటిఫికేషన్‌ జారీచేస్తామని ఎక్సైజ్‌ శాఖ వెల్లడించింది. కోనసీమ జిల్లాలో ఒక్క బార్‌కు మాత్రమే లాటరీ తీశారు. విశాఖ, ఎన్టీఆర్‌, గుంటూరు, తిరుపతి జిల్లాల్లో కొంత మెరు గు. మరీ ఆశ్చర్యంగా గీత కులాల బార్లలోనూ 6 మిగిలిపోయాయి. గీత కులాలకు రాష్ట్రవ్యాప్తంగా 84బార్లు కేటాయించారు. వాటికి లైసెన్స్‌ ఫీజు 50 శాతమే. తీరా చూస్తే ఆరు బార్లకు 4 దరఖాస్తులు రాక లాటరీనే నిర్వహించలేదు.


పూర్తిగా తప్పిన అంచనా..

ఈ స్థాయిలో బార్‌ పాలసీ విఫలమవుతుందని ఎక్సైజ్‌ అధికారులు ఊహించలేదు. అయితే ఈ పాలసీ బాగోలేదని వ్యాపారులు తొలి నుంచీ చెబుతూనే వచ్చారు. వారిని పట్టించుకోకుండా అన్ని బార్లకూ దరఖాస్తులు అందుతాయనే భ్రమలో అధికారులు ఉండిపోయారు. తీరా చివరి రోజు వచ్చే నాటికి దరఖాస్తుల సంఖ్య చూసి కంగుతిన్నారు. అది కూడా మూడు రోజులు గడువు పొడిగించడంతో ఈ సగం బార్లయినా వెళ్లాయి. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. కేవలం 56 బార్లకే దరఖాస్తులు వచ్చాయి. ఇప్పుడు దరఖాస్తులే రాకుండా మిగిలిపోయిన 421 బార్లకు రీనోటిఫికేషన్‌లో లైసెన్సీలు కచ్చితంగా వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే మిగిలిపోయిన బార్లపై వ్యాపారుల్లో పెద్దగా ఆసక్తి ఉండదని ఎక్సైజ్‌ శాఖ వర్గాలే అంటున్నాయి.

Updated Date - Aug 31 , 2025 | 06:17 AM