Share News

Vinukonda: ఇది అక్షర విజయం

ABN , Publish Date - Nov 22 , 2025 | 05:32 AM

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం సత్ఫలితాలను ఇచ్చింది.

Vinukonda: ఇది అక్షర విజయం

  • ప్రజా సమస్యలు శరవేగంగా పరిష్కరించాం: జీవీ

  • ‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌’ను అభినందించిన చీఫ్‌ విప్‌

  • వినుకొండలో 63.60 లక్షలతో నిర్మించిన డ్రెయిన్‌, సీసీ రోడ్లు ప్రారంభం

వినుకొండ, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం సత్ఫలితాలను ఇచ్చింది. పల్నాడు జిల్లా వినుకొండలో రూ.63.60 లక్షలతో నిర్మించిన డ్రెయిన్లు, సిమెంట్‌ రోడ్లను చీఫ్‌ విప్‌, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు శుక్రవారం ప్రారంభించారు. కొట్నాల్చ వీధిలో రూ.18.60 లక్షలతో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, గాయత్రినగర్‌లో రూ.45 లక్షలతో సిమెంట్‌ రోడ్లు నిర్మించారు. ఈ సందర్భంగా గాయత్రినగర్‌లో నిర్వహించిన సభలో జీవీ మాట్లాడుతూ గాయత్రినగర్‌, కొట్నాల్చ వీధిలో రహదారులు, మురుగు కాలువలు నిర్మించాలని ప్రజలు కోరారని చెప్పారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఈ పనులు పూర్తిచేయడం ఎంతో సంతోషంగా ఉందని.. సంతృప్తి ఇచ్చిందని తెలిపారు. ఇది అక్షర విజయమని కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ‘ఆంధ్రజ్యోతి’ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండా’గా కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యల్ని ప్రభుత్వం, ఎమ్మెల్యేలు, అధికారుల దృష్టికి తీసుకెళ్లడం.. వాటిని పరిష్కరించేందుకు వారధిగా నిలవడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ప్రజలు ప్రస్తావించిన సమస్యలను శరవేగంగా పరిష్కరించామని, ప్రారంభించిన రెండు నెలల్లోనే పనులు పూర్తిచేశామని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలను ‘ఆంధ్రజ్యోతి’ భవిష్యత్తులో కూడా నిర్వహించాలని జీవీ ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ సుభాష్‌ చంద్రబోష్‌, కౌన్సిలర్లు షకీలా దస్తగిరి, వాసిరెడ్డి లింగమూర్తి, ఏఈ ఆదినారాయణ, మాజీ చైర్మన్‌ షమీంఖాన్‌, పెమ్మసాని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 22 , 2025 | 05:32 AM