MP Kalishetti Appala Naidu: రాష్ట్ర ఉత్సవంగా గురజాడ జయంతి
ABN , Publish Date - Sep 22 , 2025 | 04:13 AM
ప్రఖ్యాత కవి, తన రచనల ద్వారా సమాజంలోని అనేక దురాచారాల మార్పునకు కృషిచేసిన గురజాడ అప్పారావు జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నాం
ఈ విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉంది: మంత్రి కొండపల్లి
అప్పారావు స్వగృహాన్ని అభివృద్ధి చేస్తా: ఎంపీ కలిశెట్టి
విజయనగరం, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రఖ్యాత కవి, తన రచనల ద్వారా సమాజంలోని అనేక దురాచారాల మార్పునకు కృషిచేసిన గురజాడ అప్పారావు జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ విషయాన్ని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ దృష్టికి తీసుకువెళ్లాం. వీలైనంత త్వరగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్న నమ్మకం ఉంది’’ అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలో మహాకవి గురజాడ అప్పారావు జయంతిని ఆదివారం జిల్లా యంత్రాంగం, గురజాడ సాహితీ సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక గురజాడ రోడ్డులో ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురజాడ రచనలు, సాహిత్యం 150ఏళ్లు దాటినా ఇంకా ప్రజాదరణ పొందుతున్నాయన్నారు. ఇదిలావుంటే.. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.. గురజాడ స్వగృహాన్ని సందర్శించారు. ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలుగుజాతి ఉన్నంత కాలం గురజాడ రచనలు సజీవంగా ఉంటాయన్నారు. గురజాడ స్వగృహం ఆధునికీకరణకు, గ్రంథాలయ నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో కలెక్టర్ రామసుందర్‌రెడ్డి, జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.