Woman Prisoner: జైల్లో చదువుతో.. గోల్డ్ మెడల్
ABN , Publish Date - Sep 27 , 2025 | 05:38 AM
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తూ డిగ్రీ చదువుకున్న ఓ మహిళ గోల్డ్ మెడల్ సాధించింది.
గుంటూరుకు చెందిన మహిళా ఖైదీ ప్రతిభ
రాజమహేంద్రవరం, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తూ డిగ్రీ చదువుకున్న ఓ మహిళ గోల్డ్ మెడల్ సాధించింది. జైలు అధికారులు తెలిపిన వివరాల మేరకు.. 2020లో జరిగిన హత్య కేసులో గుంటూరు జిల్లాకు చెందిన డి.నాగరాజకుమారికి శిక్ష పడింది. గత ఐదేళ్లుగా రాజమహేంద్రవరం మహిళా సెంట్రల్ జైలులో ఖైదీగా ఉంది. జైల్లో ఉంటూనే 2021 నుంచి 2024 వరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చదువుకుంది. ఆమె ఇటీవల బెయిల్‌పై విడుదలైంది. వర్సిటీ గోల్డ్ మెడల్ వచ్చిన విషయాన్ని జైలు సూపరింటెండెంట్ వసంత సదరు నాగరాజకుమారికి శుక్రవారం తెలిపారు. మహిళా సెంట్రల్ జైలులో ఇప్పటి వరకు 32 మంది ఖైదీలు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీలు పూర్తి చేశారని, ఇద్దరు పీజీ చేశారని తెలిపారు.
జైలు అధికారుల ప్రోత్సాహంతోనే..
‘జైలు అధికారుల ప్రోత్సాహంతో ఉన్నత విద్య అభ్యసించా. జైలు అనేది సంస్కరణలకు నిలయం. ఖైదీల జీవితాలను చక్కదిద్దేందుకు అక్కడి సిబ్బంది ఎంతో ప్రయత్నిస్తుంటారు. జైలులో చదువుకోవడమే కాకుండా టైలరింగ్, పెయింటింగ్ వంటివి నేర్చుకున్నా. ఈనెల 30న హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో గోల్డ్ మెడల్ అందుకోవడానికి వెళ్తాను.’
- డి.నాగరాజకుమారి